గ్రామ వార్డు సచివాలయాల భవనాలను పరిశీలించిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్

గ్రామ సచివాలయాల ద్వారా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ శ్రీ ప్రవీణ్ కుమార్ చెప్పారు.
భవన నిర్మాణ పక్షోత్సవాలలో భాగంగా పొదిలి మండలం తలమళ్ల గ్రామంలో రూ.40 లక్షల నిధులతో నిర్మిస్తున్న గ్రామ సచివాలయం నిర్మాణ పనులను ఆయన బుధవారం పరిశీలించారు. అనంతరం మాదాలవారిపాలెంలో రూ.40లక్షలతో నిర్మాణం పూర్తిచేసిన సచివాలయం భవనం, రూ.21.8 లక్షల నిధులతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం భవనాలను పరిశీలించారు. రూ.17.59 లక్షల నిధులతో చేపట్టిన వైయస్సార్ హెల్త్ క్లినిక్ భవనం అంచనాలు మారడంతో అర్ధాంతరంగా నిలిచిన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.
పేదలందరికీ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందజేయడానికి సచివాలయాలు వేదికగా మారాయని కలెక్టర్ తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో ప్రభుత్వ సచివాలయ భవనాలు నిర్మిస్తున్నామని ఆయన చెప్పారు. అలాగే రైతు భరోసా కేంద్రాలు, బల్క్ మిల్క్ యూనిట్ల భవనాలు కూడా నిర్మాణం జరుగుతున్నాయన్నారు. భవన నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నిర్మాణాల్లో రాజీ పడరాదని సంబంధిత అధికారులను ఆదేశించారు. భవన నిర్మాణ పక్షోత్సవాలలో భాగంగా పనులు వేగంగా పూర్తి చేస్తున్నామని ఆయన తెలిపారు. అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు.
కోవిడ్ నివారణపై మండల స్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం ఏడు శాతం కోవిడ్ కేసులు నమోదు అవుతున్నాయని, అవి పూర్తిగా తగ్గాలన్నారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రం చేసుకోవడం తప్పనిసరిగా పాటించేలా ప్రజలను చైతన్య పరచాలన్నారు. ముఖ్యంగా జగనన్న పాలవెల్లువ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వైయస్సార్ చేయూత లబ్ధిదారులు ముందుకు రావాలన్నారు. డెయిరీ యూనిట్లు నడుపుకునే స్వయం సహాయక సంఘాలలోని పొదుపు సభ్యులు అమూల్ సంస్థ ఏర్పాటుచేసిన పాల సేకరణ కేంద్రాలలో పాలు పోసేలా చూడాలన్నారు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న కోవిడ్ రోగులను పర్యవేక్షించాలని, వైరస్ వ్యాప్తి చెందకుండా చూడాలని ఆయన పలు సూచనలు చేశారు. గోగినేనివారిపాలెం గ్రామంలో పాల సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మాజీ సర్పంచ్ శ్రీనివాసరావు కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో డ్వామా పీడీ శీనారెడ్డి, పీఆర్ ఎస్ఈ కొండయ్య,  పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు హనుమంతరావు, ఎంపిడిఓ శ్రీకృష్ణ, నగర పంచాయితీ కమీషనర్ భవాని ప్రసాద్, వ్యవసాయ శాఖ అధికారి శ్రీనువాసులరెడ్డి , పొదిలి యస్ ఐ సురేష్ , స్థానిక సర్పంచ్ సుబ్బమ్మ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు స్థానిక సర్పంచ్ సుబ్బమ్మ, వివిధశాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.