ఏపీఎస్ ఆర్టీసీ ఆధ్వర్యంలో రహదారి భద్రతా వారోత్సవాలు…..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పొదిలి ఆధ్వర్యంలో సోమవారంనాడు 30వ రహదారి భద్రతా వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. వివరాల్లోకి వెళితే స్థానిక పొదిలి ఆర్టీసీ డిపో గ్యారేజ్ నందు ఏర్పాటు చేసిన రహదారి భద్రతా వారోత్సవాలు సభలో ముఖ్యఅతిథిగా హాజరైన పొదిలి సిఐ షేక్ చిన్న మీరాసాహెబ్ మాట్లాడుతూ వాహనం నడిపే సమయంలో చోదకులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని….. రోడ్డు ప్రమాదాలలో ఆర్టీసీని గమనిస్తే అతి తక్కువ రోడ్డుప్రమాదాలు జరుగుతున్నాయని….. ఆ అతితక్కువను కూడా నివారించవలసిన అవసరం ఉందన్నారు. రహదారి భద్రతా చట్టాలలో ఎన్నో మార్పులు జరిగాయని…. ప్రమాదం జరిగిన వెంటనే సంబంధిత పోలీసు స్టేషన్ కు ఫిర్యాదు చేయడం అలాగే గాయపడిన వ్యక్తిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదవుతాయని….. ఈ రహదారి చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి రోడ్లపై అప్రమత్తంగా వాహనాలను నడిపి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలని ఆకాంక్షించారు.

డిపో మేనేజర్ సిహెచ్ బెనర్జీ మాట్లాడుతూ 30వ రహదారి భద్రతా వారోత్సవాలలో భాగంగా ఆర్టీసీ డ్రైవర్లకు పునఃచరణ తరగతులను నిర్వహించడం జరుగుతుందని ఈ తరగతులలో డ్రైవర్ యొక్క నైపుణ్యతా మరియు అప్రమత్తంగా బస్సులను నడిపి ప్రమాదాలు జరగకుండా ప్రమాదాల శాతం “0”గా ఉండాలనే సంకల్పంతోనే రహదారి భద్రతా వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని వారోత్సవాలలొనే కాకుండా సంవత్సరంకాలం మొత్తం ఇలానే భద్రతపై దృష్టి ఉండేలా డ్రైవర్లకు భద్రతా తరగతులు నిర్వహిస్తామని అన్నారు. అలాగే పౌరులందరు తమ విధిగా ట్రాఫిక్ నియమనిబంధనలను పాటించాలని…. సురక్షితంగా…. సంతోషంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని రోడ్డుప్రమాదాలు లేని భారతదేశాన్ని నిర్మిద్దామని అశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది, డ్రైవర్లు, కార్మిక సంఘాలు, గ్యారేజ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.