మే 17 వ‌ర‌కు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్: కేంద్ర హోం శాఖ

దేశ వ్యాప్తంగా మ‌రో 14 రోజుల పాటు లాక్ డౌన్ పొడిగిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. డిజాస్ట‌ర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ప్ర‌కారం లాక్ డౌన్ పొడిగిస్తున్న‌ట్లు కేంద్ర హోం శాఖ శుక్ర‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. తొలుత  మార్చి 24 నుంచి ఏప్రిల్ 14 వ‌ర‌కు లాక్ డౌన్ విధించింది కేంద్ర ప్ర‌భుత్వం. ఆ స‌మ‌యంలోనూ క‌రోనా కేసులు భారీగా పెర‌గ‌డంతో మ‌ళ్లీ మే 3 వ‌ర‌కు పొడిగించారు. అయితే వైర‌స్ వ్యాప్తి ఆగ‌క‌పోవ‌డంతో మే 17 వ‌ర‌కు ఇలాగే కొన‌సాగించాల‌ని కేంద్రం నిర్ణ‌యించింది .

జిల్లాల వారీగా కేసుల సంఖ్య‌ను బ‌ట్టి గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లుగా విభింజించి.. మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింది. రెడ్ జోన్ల‌లో క‌ఠినంగా లాక్ డౌన్ కొన‌సాగించాల్సిందేన‌ని కేంద్ర హోం శాఖ ఆదేశించిది.ఆరెంజ్ జోన్ల‌లో ప‌రిమిత స్థాయిలో ప‌నులు చేసుకోవ‌చ్చ‌ని చెప్పింది. జిల్లాల మ‌ధ్య కూడా యాక్టివిటీకి అనుమ‌తించింది. గ్రీన్ జోన్ల‌లో భారీగా ఆర్థిక కార్య‌క‌లాపాల‌కు అవ‌కాశం ఇచ్చింది. సోష‌ల్ డిస్టెన్స్ పాటిస్తూ ప‌రిమిత సంఖ్య‌లో కార్మికులతో ప‌రిశ్ర‌మ‌ల్లో ప‌నులు చేసుకునేందుకు అనుమ‌తి ఇచ్చింది కేంద్ర హోం శాఖ‌  కేసులు త‌క్కువ‌గా ఉన్న‌చోట్ల ప‌రిశ్ర‌మ‌లు, కంపెనీలు క్ర‌మంగా ప‌నిచేయ‌డంతో పాటు ప‌రిమిత స్థాయిలో ర‌వాణా సౌక‌ర్యాల‌ను కూడా క‌ల్పిస్తూ నిర్ణ‌యం తీసుకుంది.