స్మశానంలో సచివాలయానికి శంఖుస్థాపన…. పనులను అడ్డుకున్న స్ధానికులు

మండల పరిధిలోని మల్లవరం గ్రామంలో నూతన గ్రామ సచివాలయం భవనానికి గత గురువారంనాడు శంఖుస్థాపన ‌చేయగా ఆదివారం నుంచి పనులు ప్రారంభించేందుకు వచ్చిన వారిని స్ధానిక గ్రామస్తులు అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా గ్రామస్థులు పొదిలి టైమ్స్ తో మాట్లాడుతూ గురువారంనాడు మేము కరువు పనికి వెళ్ళిన సమయంలో స్మశానాన్ని చదును చేసి శంఖుస్థాపన చేశారని…. గత 50సంవత్సరాలగా స్మశానంగా ఉపయోగించుకుంటున్న భూమిలో గ్రామ సచివాలయం నిర్మాణం చేయడం అన్యాయమని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ స్మశానంలో గత 50సంవత్సరాలుగా గ్రామంలో ఉన్న 90శాతం మంది ఇక్కడే స్మశానంగా ఉపయోగించుకుంటున్నారని కాబట్టి ఇక్కడే స్మశానం ఉపయోగాన్ని కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రైతులు వారి పొలాల్లో సమాధులు పెట్టుకునే అవకాశం ఉందని…. భూమి లేని దళితులమైన మా పరిస్థితి ఏమిటి అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ….. తక్షణమే అధికారులు ఇక్కడ నిర్మాణ పనులు నిలిపివేసి స్మశానాన్ని పునరుద్ధరించి సమాధులను చదును చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.