రైతులకు వ్యతిరేకం – కార్పొరేట్ శక్తులకు దాసోహం అంటున్న – వైకాపా – టిడిపి పార్టీలు

బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారిన జగన్, చంద్రబాబు!

పిసిసి అధికార ప్రతినిధి షేక్ సైదా ధ్వజం!

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గురువారం లోక్సభలో ఆదివారం రాజ్యసభలో ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక  వ్యవసాయ చట్టాల బిల్లుకు అధికార ప్రతిపక్ష పార్టీ అయిన వైకాపా, తెదేపా పార్టీలు నిస్సిగ్గుగా పోటీలు పడి మద్దతివ్వడం సిగ్గుచేటు చర్యని రైతులకు ద్రోహం చేయడమేనని నేడు పొదిలి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో జరిగిన విలేకర్ల సమావేశంలో పిసిసి అధికార ప్రతినిధి, మార్కాపురం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ షేక్ సైదా తీవ్రంగా విమర్శించారు.

బిజెపి మిత్రపక్షమైన అకాలీదళ్ రైతు వ్యతిరేక బిల్లును వ్యతిరేకించి కేంద్ర మంత్రివర్గం నుండి వైదొలగింది అని, బిజు జనతాదళ్ బిల్లును వ్యతిరేకించి ఉందని, కానీ మన రాష్ట్రానికి చెందిన వైకాపా, తెదేపా పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం రైతు వ్యతిరేక బిల్లుకు మద్దతునివ్వడం శోచనీయమని, ఈ రెండు పార్టీలు బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారి తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాలను, రైతు ప్రయోజనాలను నిర్లజ్జగా బిజెపి కి తాకట్టు పెడుతున్నాయని సైదా ధ్వజమెత్తారు.

ఈ బిల్లు చట్టాలు అయితే రాబోయే రోజుల్లో వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర లభించదని, మార్కెట్ యార్డులు మూత పడతాయని. రైతులు పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు కట్టుబానిసలా కావాల్సి వస్తుందని ఈ బిల్లు” తేనెపూసిన కత్తి లాంటిదని, రైతులకు వ్యతిరేకం- కార్పొరేట్ శక్తులకు అనుకూలమని, రైతుల కష్టార్జితాన్ని కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టే కుట్రలో భాగమే ఈ వ్యవసాయ సవరణ చట్టం బిల్లు అని సైదా విమర్శించారు.

వైకాపా పార్టీ ఈ15 నెలల కాలంలో అనేక రైతు వ్యతిరేకం నిర్ణయాలు తీసుకుందని, రైతు భరోసా పథకం కింద రైతులకు చెందాల్సిన ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి రైతుల నోట్లో మట్టి కొట్టారు అని, రైతు భరోసా కేంద్రాలు పేరుతో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు ,పురుగు మందులు ,యంత్ర పరికరాలు శాస్త్రజ్ఞుల తో నూతన వ్యవసాయ విధానాలు మీద సలహాలు ఇస్తామని రైతులను నమ్మించి మోసం చేశారనికాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతు బాంధవుడు వైయస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే ఉచిత విద్యుత్కు మీటర్లు పేరుతో రైతులను ఉచిత విద్యుత్ పథకానికి దూరం చేస్తున్నారని, వాతావరణం అనుకూలించక, పంటలు పండక, పండిన పంటకు గిట్టుబాటు ధర లభించక అన్నం పెట్టే రైతన్న ఆత్మహత్యలు చేసుకుని టువంటి తరుణంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం “మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా, గోరుచుట్టుపై రోకలి బండలా” జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న బిల్లులు రైతులకు మరణ శాసనాలు గా గోచరిస్తున్నాయి అని సైదా తీవ్రంగా ధ్వజమెత్తారు

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు షేక్ బాబా ఖాదర్ వలీ, మండల కిసాన్ సెల్ అధ్యక్షులు శ్రీ కొత్తపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, పొదిలి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముల్లా ఖాదర్బాషా, జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు, కొట్టు వరప్రసాద్, కేకే మెట్ల జడ్పిటిసి కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ డి సుబ్బారావు, తర్లుపాడు మండలం కాంగ్రెస్ పార్టీ జడ్పిటిసి అభ్యర్థి, షేక్ బడేసాహెబ్, మార్కాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ జెడ్పిటిసి అభ్యర్థి, శ్రీ కే.సుబ్బారావు,
జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శి, శ్రీనివాస్ రెడ్డి, పొదిలి మండలం ఎస్సీ సెల్ అధ్యక్షులు లింకన్ తదితరులు పాల్గొన్నారు.