తాగునీటి సరఫరాలో సమగ్ర ప్రణాళికతో పని చేయాలి: జిల్లా కలెక్టర్

తాగునీటి సరఫరాలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు సమగ్ర ప్రణాళికతో, సమిష్టిగా పని చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ ప్రవీణ్ కుమార్ ఆదేశించారు. తాగునీటి సరఫరాపై ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, దర్శి నియోజకవర్గాల్లోని మండల స్థాయి అధికారులతో మంగళవారం పొదిలిలోని ఎంపీడీవో కార్యాలయంలో ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే నాలుగు నెలలు అత్యంత అప్రమత్తంగా ఉండి పని చేయాలని స్పష్టం చేశారు. భౌగోళిక స్థితిగతులు, స్థానిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని ఆయన సూచించారు. తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో అధికారులు తరచూ పర్యటించి పరిస్థితులను పరిశీలిస్తూ ఉండాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. స్థానిక అవసరాలను బట్టి ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని అన్నారు. తహసిల్దార్, ఎం.పీ.డీ.వో, ఆర్.బ్ల్యూ.ఎస్. ఏ.ఈ., ఈ.వో. పి.ఆర్. ఆర్.డి. లతో కూడిన మండల స్థాయి కమిటీ పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తూ ఉండాలని ఆయన స్పష్టం చేశారు. అవసరాన్నిబట్టి బ్యాంకుల ద్వారా సరఫరా చేయాలని కలెక్టర్ చెప్పారు. క్రమశిక్షణను ఉల్లంహించి నిర్దిష్ట సమయం కంటే ఆలస్యంగా నీరు సరఫరా చేసినా, నీటి పంపిణీ లో నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా లో అవినీతికి పాల్పడితే జైలుకు పంపిస్తానని ప్రకటించారు. ఆయా మండలాల వారీగా నీటి వనరుల లభ్యత, పంపిణీ చేస్తున్న తీరు, వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టేందుకు రూపొందించిన ప్రణాళికలపై ఈ సందర్భంగా ఆయన ఆరా తీశారు.

కలెక్టరేట్లో కాల్ సెంటర్


తాగునీటి సమస్యలపై ఫిర్యాదులు చేయడానికి జిల్లాస్థాయిలో కలెక్టరేట్లో ప్రత్యేక కాల్ సెంటరును ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పోస్టరును ఈ సందర్భంగా ఆయన ఆవిష్కరించారు. కలెక్టరేట్ లో 08592 -228000 అనే నంబరుతో కాల్ సెంటరును ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. గ్రామీణ నీటి సరఫరా పర్యవేక్షక ఇంజినీర్ (ఒంగోలు సర్కిల్)- 91001 21600; కార్యనిర్వాహక ఇంజినీర్ (ఒంగోలు డివిజన్) 91001 21610; కార్యనిర్వాహక ఇంజినీర్ (పొదిలి) 91001 21651 అనే నెంబర్లకు కూడా ఫోన్ చేసి ఫిర్యాదులు చేయొచ్చని చెప్పారు.
అలాగే మండల స్థాయి అధికారుల నంబర్లు కూడా ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పారు. తాగునీటి సమస్యలపై ప్రజలతో మాట్లాడాలని అధికారులకు స్పష్టంచేశారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అలాగే జగనన్న లేఔట్లకు కూడా నీటి సరఫరాలో అవాంతరాలు తలెత్తకుండా చూడాలని, ఈ విషయంలో ఆర్.డబ్య్లు.ఎస్. అధికారులు, హౌసింగ్ అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆయన ఆదేసించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) విశ్వనాథన్, సబ్ కలెక్టర్ అపరాజితా సింగ్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్.ఈ. మర్దన్ అలీ, డి.పి.ఓ. నారాయణరెడ్డి, జడ్పీ సీఈవో జాలి రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, ఆర్డబ్ల్యూఎస్ ఏ.ఈ.లు, ఎంపీడీవోలు, పబ్లిక్ హెల్త్ ఇన్స్ పెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.