రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా క్షేత్రస్థాయి పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్….. ఐజీ నుండి ప్రశంసలు అందుకున్న ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మునుపెన్నడూ లేని విధంగా క్షేత్రస్థాయి పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖిగా మాట్లాడేందుకు వీలుగా ప్రకాశంజిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం ప్రయోగాత్మకంగా నిర్వహించి విజయవంతం చేశారు.

వివరాల్లోకి వెళితే గతంలో జిల్లా పోలీసు ఉన్నతాధికారి కార్యాలయం నుండి క్షేత్రస్థాయి పోలీసు అధికారులకు సెట్ కాన్ఫరెన్స్ ద్వారా కానీ ఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా కానీ మాట్లాడేందుకు వీలుంది….. కానీ వీటికి భిన్నంగా ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఒకడుగు ముందుకు వేసి ప్రస్తుతం క్షేత్రస్థాయి అధికారులతో ముఖాముఖిగా సమీక్ష నిర్వహించేందుకు జిల్లాలో ఉన్న అన్ని పోలీసు స్టేషన్లలో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కల్పించారు.

ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో భాగంగా శనివారంనాడు
ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ జిల్లాల్లోని అన్ని పోలీసు స్టేషన్లకు అనుసంధానం చేయబడిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా పోలీసు శాఖలోని అధికారులు, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐ లతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పొదిలి సర్కిల్ ఆఫీసు నందు సిఐ శ్రీరామ్, పొదిలి పోలీసు స్టేషన్ లో ఎస్ఐ సురేష్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ లో గుంటూరు రేంజ్ ఐజీ వినీత్ బ్రిజ్లాల్ మాట్లాడుతూ ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఆలోచనను పోలీసింగ్ లో తీసుకుంటున్న నూతన ఒరవడిలను….. అలాగే ప్రకాశంజిల్లా పోలీసులను అభినందించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం వలన క్షేత్రస్థాయి పోలీసు అధికారులు వారి వారి కార్యాలయం నుండే ముఖాముఖిగా మాట్లాడడం ద్వారా సమయం ఆదా అవడమే కాకుండా ప్రజలకు సమస్య పరిష్కారానికి ఎంతో సౌకర్యంగా ఉంటుందని….. పోలీసు శాఖకు అలాగే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని పోలీసు అధికారులు తెలిపారు.