మహిళ ఉసురుతీసిన వివాహేతర సంబంధం

వివాహేతర సంబంధం కారణంగా మహిళ హత్యకు గురైన సంఘటన మర్రిపూడి మండలంలోని కూచిపూడి గ్రామ సమీప కొండల్లో గురువారం వెలుగుచూసింది.

కూచిపూడి కొండల్లో గుర్తు తెలియని మహిళ కాలిపోయిన మృతదేహం ఉందంటూ వచ్చిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న మర్రిపూడి ఎస్ఐ సుబ్బరాజు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కొద్దినిమిషాల వ్యవధిలోనే మృతదేహం కనిగిరిలో మిస్సింగ్ కేసు నమోదైన రజియా మృతదేహంగా గుర్తించారు.

వివరాల్లోకి వెళితే పోలీసుల కథనం ప్రకారం……. కనిగిరి మండలం కంచర్లవారిపల్లికి చెందిన షేక్ బాజి, మీరాబి దంపతులకు ఇద్దరు కుమార్తెలు కాగా వృత్తిరీత్యా కనిగిరిలో నివాసం ఉంటున్నారు. పెద్ద కుమార్తె రజియా(33)కు కనిగిరికి చెందిన రసూల్ కు 14సంవత్సరాల క్రితం వివాహం చేశారు. అయితే మద్యానికి బానిసైన రసూల్ ప్రతిరోజు మద్యంసేవించి రజియాను హింసిస్తూ ఉండేవాడు. అయితే గత మూడు నెలల క్రితం భర్త చనిపోవడంతో తల్లిదండ్రుల వద్దనే ఉంటుంది రజియా….

కాగా వృత్తిరీత్యా రజియా వెలుగు సంస్థలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగినిగా పనిచేస్తున్న రజియాకు విధులకు వెళ్లివచ్చే క్రమంలో ఓ ఆటో డ్రైవరుతో ఏర్పడిన పరిచయం అక్రమ సంబంధానికి దారితీయడంతో…… ఈ క్రమంలోనే ఆటోడ్రైవరుకు రజియా 30వేల రూపాయలను ఇచ్చి ఆ డబ్బును తిరిగి ఇవ్వమని ఫోన్ చేసి అడగడంతో ఆటో డ్రైవర్ ఇంటికి వచ్చి రజియాపై దాడి చేయడంతో స్థానికులు వెంటపడగా పారిపోయినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని తెలిపారు.

అయితే ఈనెల 10వతేదిన గత ఐదురోజుల నుండి తమ కుమార్తె కనపడలేదంటూ రజియా తండ్రి బాజి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కనిగిరి పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కాగా అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కుమార్తె మృతిచెందినట్లు వార్త తెలుసుకున్న రజియా తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ సంఘటన స్థానికులను కూడా తీవ్రంగా కలచివేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.