రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలు ఉపసంహరించుకోవాలి- సిపిఎం

అప్రకటిత విద్యుత్ కోతలతో రైతులు, ప్రజలు అవస్థలు

  • పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణం ఉపసంహరించుకోవాలని సిపిఎం రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ జాలా అంజయ్య అన్నారు.

సిపిఎం పశ్చిమ ప్రకాశం జిల్లా ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెంచిన విద్యుత్ ఛార్జీల భారం ప్రజలకు భారంగా మారిందని‌ గత రెండు సంవత్సరాలుగా ప్రజలు కరోనా, లాక్ డౌన్ పరిస్థితులతో ఉపాధి కోల్పోయి జీవితం దుర్భరంగా మారి, ఇబ్బందులు పడుతుంటే వారిపై రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచడం గోరుచుట్టుపై రోకటి పోటులా ఉంటుందన్నారు.

పెంచిన విద్యుత్ చార్జీలను తోడు గత వారం రోజులుగా అప్రకటిత విద్యుత్ కొరత తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు పేదలు వినియోగించే విద్యుత్ చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం పెద్దలకు రాయితీలు ఇచ్చే విధంగా ఉందన్నారు. కరోనా తర్వాత పూర్తిగా మూలనపడ్డ పరిశ్రమలు ఉత్పాదక రంగాలు ఇప్పుడిప్పుడే పుంజుకుంటూ ఉండగా ప్రస్తుతం ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు, కరెంటు కోతలతో మరోసారి తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.

కార్మికుల పనివేళల్లో విద్యుత్ కోతలు అమలు చేయడంతో వారు పని కోల్పోయి ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ఈ ఏడాది ఉగాది కానుకగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపు ప్రజలకు ఇచ్చిందన్నారు.

గత టీడీపీ ప్రభుత్వం లో ప్రతిపక్షంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి బాదుడే బాదుడు అంటూ విద్యుత్ ఛార్జీల పెంపు విమర్శించి, తాము అధికారంలోకి వస్తే కరెంటు చార్జీలు తగ్గిస్తామని 200 యూనిట్లు వాడుకునేవారు అందరికీ ఉచితంగా విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చిన మాటను తుంగలో తొక్కి ప్రజలకు షాక్ ఇచ్చారన్నారు.

తమ ప్రభుత్వం విద్యుత్ చార్జీలు స్వల్పంగా పెంచిందని, ఇతర రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో కరెంటు ఛార్జిలు చాలా తక్కువగా త్యాగాలు చేయాలని వైఎస్సార్సీపీ నేతలు ప్రభుత్వ పెద్దలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో సుమారు 70 లక్షల విద్యుత్ కుటుంబాలపై సుమారు నాలుగు వేల మూడు వందల కోట్ల భారం పడుతుందన్నారు.

గత 20 సంవత్సరాల కాలంలో ఏ ప్రభుత్వం 50 యూనిట్ల లోపు వాడుకొనే వారి జోలికి రాలేదన్నారు. ప్రభుత్వం 30 యూనిట్లు వాడుకునే వారిని కూడా వదలలేదు అన్నారు. పేదలు మధ్య తరగతి ప్రజలు లక్ష్యంగా విద్యుత్ చార్జీలు పెంచిన ప్రభుత్వం 30 యూనిట్లు వాడే వారికి 30 శాతం, 75 యూనిట్ల లోపు వాడేవారికి పై 44%, 125 యూనిట్ల లోపు వాడేవారికి 45 శాతం వడ్డించింది అన్నారు. 400 యూనిట్లు పైబడి వాడుకునే వారికి కేవలం ఒక్క శాతం పెంచి పెద్దలకు వరాలు పేదలకు భారాలు అని నిరూపించింది అన్నారు. ఈ పెంపు చార్జీలు 14 కోట్లు ఉండగా అదనంగా ట్రూ అప్ చార్జీల పేరుతో 2014 -19 మధ్య వాడుకున్న విద్యుత్ పై మరో రెండు వేల తొమ్మిది వేల కోట్ల భారం వేస్తున్నారు.

ఈ దుర్మార్గమైన ఛార్జీల పేరుతొ 36 నెలల పాటు నెలకు పెంచిన ఛార్జీలు తోపాటు, అదనంగా యూనిట్ కు 23 పైసల చొప్పున వసూలు చేస్తారన్నారు. ఈ రెండు భారాలు కలిపి యూనిట్ కు 68పైసల నుండి రూపాయి 80 పైసలవరకు పెరుగుతున్నారు. 300 యూనిట్ల వినియోగం దాటితే రేషన్ కార్డులు తొలగిస్తామని, ప్రభుత్వ పథకాలు కోత పెట్టేందుకు కుట్ర జరుగుతోందని విమర్శించారు. ఇప్పటివరకు మిగులు విద్యుత్ తో పురోగతిలో ఉన్న రాష్ట్ర విద్యుత్ రంగం ముఖ్యమంత్రి పరిపాలనా రాహిత్యంతో అధోగతి పాలు చేస్తూ ప్రకటిత విద్యుత్ కోతలతో అన్నదాతల పంటలు ఎండిపోవడానికి కారణమవుతున్నారని విమర్శించారు.

సిపిఎం పశ్చిమ ప్రకాశం జిల్లా కార్యదర్శి హనీఫ్ మాట్లాడుతూ జిల్లాలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ ఏడాది ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

రాబోయే వేసవిని దృష్టిలో పెట్టుకొని పిల్లల త్రాగునీటి సమస్య లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం రమేష్ డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో సోమయ్య వెంకటేశ్వర్లు ,వెల్లంపల్లి ఆంజనేయులు, పిసి కేశవరావు ,టి రంగారావు ,సిహెచ్ అంజయ్య ,ఏ మాల్యాద్రి ,జి బాల నాగయ్య ,టి ఆవులయ్య ,టీ తిరుపతిరావు, పి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు
edited 07:06 PM