మాజీ శాసనసభ్యులు సానికొమ్ము పిచ్చి రెడ్డి కి కన్నీటి వీడ్కోలు
అన్న, అక్క, తమ్ముడు, బాసూ… అంటూ నిన్న మొన్నటి వరకు తమ మధ్య తిరిగిన నాయకుడికి పశ్చిమ ప్రకాశం కన్నీటి వీడ్కోలు పలికింది. జననేతకు అశ్రునివాళి అర్పించింది. అభిమాన నాయకుడి ఆఖరి చూపు కోసం జన సందోహం తరలివచ్చింది.
తమ కోసం మళ్లీ పుట్టాలంటూ భోరునవిలపించింది. పశ్చిమ ప్రకాశం లో అభివృద్ధి ప్రదాత మాజీ శాసనసభ్యులు సానికొమ్ము పిచ్చి రెడ్డి అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం అధికార లాంఛనాలతో జరిగాయి.
అంతిమయాత్రలో కుటుంబ సభ్యులతోపాటు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, నాయకు లు, అనుచరులు, అభిమానులు, అశేష జనవాహిని పాల్గొంది. పిచ్చి రెడ్డి అమర్‌రహే నినాదం మిన్నంటింది.
రాష్ట్ర మంత్రులు సురేష్ , బాలినేని శ్రీనివాసరెడ్డి,తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి, అన్నా రాంబాబు, మాజీ శాసనసభ్యులు బాచిన చెంచు గరటయ్య, ఉడుముల శ్రీనివాసులురెడ్డి, జంకె వెంకటరెడ్డి, ముక్కు కాశీ రెడ్డి, ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి లు సానికొమ్ము పిచ్చి రెడ్డి పార్ధివదేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు.
మరణం అందరికీ అనివార్యం అని, కానీ జన హృదయాల్లో కొందరే నిలిచి ఉంటారని, అలాంటి వారిలో పిచ్చి రెడ్డి ఒకరని కొనియాడారు.
పొదిలి, కొనకనమీట్ల,మర్రిపూడి మండలాలకు చెందిన తెలుగు దేశం పార్టీ, వైసిపి, బిజెపి, కాంగ్రెసు పార్టీ,జనసేన, సిపిఐ, సిపిఎం పార్టీల నాయకులు ఘనంగా నివాళులర్పించారు.
గంధపు చెక్కలు పరచిన కుటుంబ సభ్యులు అంతిమంగా హిందూ శ్మశాన వాటికకు పిచ్చి రెడ్డి పార్ధివ దేహం చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన భౌతికాయంపై చితికి ముందు కుటుంబ సభ్యులు గంధపు చెక్కలను పేర్చారు.
ప్రభుత్వ అధికారిక లాంఛనాలు పూర్తయిన అనంతరం కుమారుడు శ్రీనివాసులురెడ్డి చితికి నిప్పంటించారు.
చివరి మజిలీ లో పెద్ద ఎత్తున ప్రజలు అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పొదిలి సిఐ సుధాకర్ రావు యస్ఐ శ్రీహరి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.