వైసీపీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల హక్కులను కాల రాసిన వైసీపీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రమేష్ సిపిఐ మండల కార్యదర్శి కె వి రత్నం అన్నారు.
శుక్రవారం నాడు పొదిలిలోని సిఐటియు కార్యాలయం లో సిఐటియు, ఎఐటియుసి,పెన్షనర్ల సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో రమేష్ మాట్లాడుతూ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని, అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపియస్ రద్దు చేస్తామని, మెరుగైన పి ఆర్ సి ఇస్తామని ఐ ఆర్ కంటే ఫిట్ మెంట్ తగ్గించటమే కాక హౌస్ రెంట్ , అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ తగ్గించినందుకు ఓటు వేయాలనా అని ప్రశ్నించారు.
స్కీం వర్కర్స్ కి పని ఒత్తిడి పెంచి కనీస వేతనాలు అమలు చేయకపోగా ఎలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించలేదన్నారు. కేంద్రంలోని బిజెపి విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు పేరుతో సాధించుకున్న విశాఖ ఉక్కుని కార్పోరేట్లకు తెగ నమ్ముతుంటే వైసిపి నిమ్మకు నీరెత్తినట్లు ఉందన్నారు.
పోరాడుతున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలపై తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించి అణిచివేతకి పూనుకుంటున్నటువంటి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలంటే ఉపాధ్యాయ, పట్టబధ్రుల స్థానాలలో పిడిఎఫ్ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు (1) వేసి గెలిపించాలని అన్నారు.
ఎఐటియుసి పొదిలి మండల కార్యదర్శి కె.వి.రత్నం మాట్లాడుతూ విద్యావంతులు పోటీపడే ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా ఓట్లు కొనుగోలుకు తెరలేపి వైసిపి దిగజార్చుతుందన్నారు. ఎన్నికల యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ఓట్లు కొనుగోలును నివారించి ప్రజాస్వామ్య,నైతిక హక్కులను కాపాడాలన్నారు.నైతిక విలువలకు కట్టుబడుతూ ప్రజాసమస్యలపై గళం విప్పే పిడిఎఫ్ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు 1 వేసి గెలిపించాలని అన్నారు.
ఈ ప్రెస్ మీట్ లో ఫెన్షనర్స్ అసోసియేషన్ పొదిలి తాలుకా యూనిట్ ట్రెజరర్ చిట్టెం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.