సంఘమిత్ర ఎక్స్ప్రెస్ రైలుకు తప్పిన ప్రమాదం

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

ప్రాణం సైతం లెక్కచేయకుండా ట్రైన్ అపిన హేమ సుందర్

బాపట్ల జిల్లా ఈపురుపాలెం రైల్వే స్టేషన్ కు దగ్గరలో విరిగిన రైలు పట్టాలు

ప్రాణాలు సైతం లెక్కచేయకుండా సంఘమిత్ర ఎక్స్ప్రెస్ కు ఎదురు వెళ్లి ట్రైన్ ను ఆపిన గద్దె హేమ సుందర్.

పెను ప్రమాదం నుండి వందలాది మందిని కాపాడిన

గద్దె హేమ సుందర్ ను ఘనంగా సన్మానించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్..

 

వివరాల్లోకి వెళితే జూన్ 22 గురువారం ఉదయం సుమారు 7 గంటల సమయంలో బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం గ్రామంలో నివాసముండే 48 సంవత్సరాల వయస్సు గల గద్దె హేమ సుందర్ బాబు రైల్ పట్టాల వైపు వెళ్లిన సమయంలో రైలు పట్టా విరిగినట్లు గమనించి వెంటనే అప్రమత్తమై ఆ ట్రాక్ పై విజయవాడ వైపు నుండి రైళ్లు వచ్చును కనుక అటువైపు సుమారు అర కిలోమీటర్ మేర పరిగెత్తుకుంటూ వెళ్లి విజయవాడ వైపు నుండి బెంగళూరుకు వెళుతున్న సంఘమిత్ర ఎక్స్ప్రెస్ ట్రైన్ కు ఎదురు వెళ్ళి ట్రైన్ నడుపుతున్న లోకో పైలట్లకు అర్థమయ్యే రీతిలో రైలు పట్టా విరిగినదని సైగలు చేస్తూ వారికి సమాచారం అందించినాడు.

అది గమనించిన సంఘమిత్ర ఎక్స్ప్రెస్ ట్రైన్ నడుపుతున్న లోకో పైలట్లు వెంటనే ట్రైన్ ను ఆపి అప్పటికే ట్రైన్ ఇంజన్ విరిగిన రైలు పట్టా మీదకు వెళ్ళి ఆగటం తో పెనుప్రమాదం నుంచి వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు.

సంబంధించిన విషయాన్ని తెలుసుకున్న బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గురువారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గద్దె హేమ సుందర్ బాబును శాలువాతో ఘనంగా సన్మానించి మెమెంటో, ప్రశంసా పత్రాన్ని అందజేసి, జరిగిన ఘటన గురించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.