ఉదయ్ కేసులో కోర్టులో లొంగిపోయిన ఇద్దరు నిందితులు
పొదిలి మండల తెలుగు యువత అధ్యక్షుడు నంద్యాల ఉదయ్ శంకర్ యాదవ్ పై జూన్ 30వ తేదీన జరిగిన హత్యాయత్నం కేసులో మొదటి ముద్దాయి అయిన కనుబద్ది రమణారెడ్డి(బజాజ్ రమణారెడ్డి) మరియు రెండవ ముద్దాయి అయిన ఎర్రయ్య(రాజు)లు జులై 3వ తేదీ మంగళవారం నాడు కోర్టులో లొంగిపోయారు. ఈ కేసుకు సంబంధించి పొదిలి సిఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ దాడి అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిన రమణారెడ్డి గురించి విస్తృతంగా గాలిస్తున్న పోలీసులకు దొరకకుండా సోమవారం రాత్రి కోర్టు భవనం పైకి ఎక్కి అక్కడే నిద్రించి మంగళవారం ఉదయం కోర్టులోకి ప్రవేశించారని తెలిపారు. వీరికి కోర్టు 14రోజుల రిమాండు విధించి ఒంగోలు జిల్లా జైలుకు తరలించాలని కోర్టు వారు ఉత్తర్వులు జారీ చేయగా మంగళవారం సాయంత్రం 6గంటల సమయంలో పోలీసు వాహనంలో ఒంగోలుకు తరలించారు.