ఆంధ్రప్రదేశ్ లో పాడి రైతులకు మినీ గోకులాలు
మినీ గోకులం(పశువసతి గృహాలు)లను మూడు కేటగిరీలుగా విభజించారు. ఒకటో కేటగిరిలో రెండు,
రెండో కేటగిరిలో నాలుగు పశువులు,
మూడో కేటగిరిలో ఆరు పశువులకు వసతి గృహాలను నిర్మించనున్నారు.
మొదట్లో 20, 50, 100 పశువులకు వసతి గృహాల నిర్మాణానికి చర్యలు చేపట్టగా.. పాడి రైతులు పెద్దగా ఆసక్తి చూపలేదు. అధిక సంఖ్యలో పాడి రైతులకు లబ్ధిచేకూర్చాలనే లక్ష్యంతో మినీ గోకులాల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
🌈 కేటగిరీ-1: రెండు పశువుల వసతి గృహం(పశువుల షెడ్). నిర్మాణం యూనిట్ విలువ రూ.లక్ష. రాయితీ రూ.90 వేలు. లబ్ధిదారుని వాటా రూ.10 వేలు. సొంతంగా అర సెంటు స్థలం కలిగి ఉండాలి.
🌈 కేటగిరీ-2: నాలుగు పశువుల వసతి గృహం. నిర్మాణం యూనిట్ విలువ రూ.1.50 లక్షలు. రాయితీ రూ.1.35లక్షలు. లబ్ధిదారుని వాటా రూ.15 వేలు. సొంతంగా ఒక సెంటు స్థలం ఉండాలి.
🌈 కేటగిరీ-3 : ఆరు పశువుల వసతి గృహం. నిర్మాణం యూనిట్ విలువ రూ.1.80లక్షలు. రాయితీ రూ.1.62లక్షలు. లబ్ధిదారుని వాటా రూ.18 వేలు. సొంతంగా ఒకటిన్నర సెంటు స్థలం కలిగి ఉండాలి.
లబ్ధిదారుల ఎంపిక ఇలా..
మినీ గోకులాలను మహిళల పేరు మీద మంజూరు చేస్తారు. పంచాయితీల్లో గ్రామసభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. పంచాయతీ ప్రత్యేక అధికారి, గ్రామ కార్యదర్శి ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించి.. లబ్ధిదారులను గుర్తించారు. ఎంపికైన లబ్ధిదారుల వివరాలను వారివారి పరిధిలోని పశుసంవర్ధక శాఖ ఉపసంచాలకులు(డీడీ)లకు నివేదిస్తారు. నిబంధనల ప్రకారం వారు యూనిట్లను మంజూరు చేస్తారు.
మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో..
పశువసతి గృహాల నిర్మాణం మార్కెటింగ్ శాఖ ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణలో జరుగుతుంది. పశుసంవర్ధక శాఖ డీడీలు నివేదించిన లబ్ధిదారుల వివరాల ప్రకారం అంచనాలు తయారు చేసి.. మార్కెటింగ్ శాఖ ఎస్ఈకి పంపుతారు. ఎస్ఈ అనుమతిలో నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. 90 శాతం ఉపాధిహామీ నిధులు, 10 శాతం లబ్ధిదారుని వాటాతో నిర్మిస్తారు. లబ్ధిదారుడు తన వాటాగా నిర్మాణానికి అవసరమైన సామగ్రిని ఇవ్వొచ్చు.
అర్హులు వీరే..
లబ్ధిదారులు పాడి రైతుగా ఉంటూ.. సొంత స్థలం ఉండాలి. ఉపాధిహామీ జాబ్ కార్డు కలిగి ఉన్న పాడిరైతులే పథకానికి అర్హులు. ప్రస్తుత ఎస్సీ, ఎస్టీ పాడి రైతులకే పథకాన్ని వర్తింప చేస్తున్నారు. లబ్ధిదారుల ఎంపికలో వికలాంగులు, మహిళలకు ప్రాధాన్యం ఉంటుంది. పథకం విజయవంతమైతే జనరల్, ఇతర పాడి రైతులకు వర్తింపచేయనున్నారు.
పటిష్ఠంగా పథకం అమలు
మినీ గోకులం పథకాన్ని పటిష్ఠంగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టాం. సత్వరమే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించి.. పథకం వేగవంతానికి ప్రణాళికలు రూపొందించాం. పశువసతి గృహాలు కావలసిన పాడి రైతులు పంచాయితీల ప్రత్యేక అధికారులు, గ్రామ కార్యదర్శులను సంప్రదించాలి. అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి.