సకాలంలో108…….. సిబ్బంది సేవ భేష్

దర్శి – పొదిలి మార్గం మధ్యలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న యువకుడు అస్వస్థతకు గురైన సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే పొదిలి నుండి బయలుదేరి మార్గ మధ్యలోనే 108 వాహనంలో సకాలంలో వ్యక్తిని వైద్యశాలకు తరలించి పలువురి ప్రశంసలు అందుకున్నారు. వివరాల్లోకి వెళితే దర్శికి చెందిన నిడమానూరి వెంకటేశ్వర్లు తలనొప్పితో బాధపడుతూ కొద్దిరోజులుగా దర్శిలో చికిత్స తీసుకుంటూ తలనొప్పి తగ్గకపోవడంతో వైద్యం కోసం ఒంగోలు వెళ్లే క్రమంలో మణుగూరు – కనిగిరి బస్సులో బయలుదేరగా మార్గం మధ్యలో అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో తోటి ప్రయాణికులు 108కు సమాచారం అందించారు. విధులలో ఉన్న 108 సిబ్బంది ఆదాం మరియు శ్రీనులు వెంటనే బయలుదేరి మార్గం మధ్యలోనే బస్సును ఆపి అస్వస్థతకు గురైన వ్యక్తిని పొదిలిలోని ఒక ప్రైవేట్ వైద్యశాలకు తీసుకుని వెళ్లగా మెరుగైన వైద్యం కోసం ఒంగోలు వెళ్లాలని తెలిపారు. తక్షణమే అదే 108 వాహనంలో ఒంగోలు రిమ్స్ కు తరలించగా అక్కడ వైద్యసేవలు నిర్వహించిన వైద్యులు సకాలంలో రోగిని వైద్యశాలకు తరలించడం పట్ల 108 సిబ్బంది ఆదాం, శ్రీనులను అభినందించారు. వీరు గతంలో కూడా గర్భిణి పురిటి నొప్పులతో బాధ పడుతున్న సమాచారంతో సకాలంలో స్పందించి గర్భిణిని వైద్యశాలకు తరలించే క్రమంలో నొప్పులు తీవ్రం అవడంతో 108 వాహణంలోనే కాన్పు చేసి తల్లి, బిడ్డల ప్రాణాలను కాపాడారు.