పౌరసరఫరాల సంస్థ గిడ్డంగి ప్రారంభోత్సవ సభలో జంకె కు చేదు అనుభవం….. సభా ప్రాంగణం నుండే తిరుగుప్రయాణం
పౌరసరఫరాల సంస్థ గిడ్డంగి ప్రారంభోత్సవ సభలో మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డికి చేదు అనుభవం ఎదురవ్వడంతో ప్రాంగణం నుండే వెనుదిరిగారు. వివరాల్లోకి వెళితే స్థానిక మార్కాపురం అడ్డరోడ్డు వద్ద నూతనంగా నిర్మించిన పౌరసరఫరాల సంస్థ గిడ్డంగిని బుధవారంనాడు ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల సంస్థ చైర్మన్ చల్లా రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ రామకృష్ణారెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ దివి శివరాం, మార్కాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి హాజరయ్యారు. ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన వేదికపై రామకృష్ణారెడ్డి మరియు దివి శివరాంలకు మాత్రమే అతిథి స్థానములు కేటాయించడంతో రామకృష్ణారెడ్డి, దివి శివరాంలు వారి వారి స్థానాలను అధిష్టించగా ముఖ్య అతిథి నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన జంకె వెంకటరెడ్డికి వేదికపై స్థానం కేటాయించకపోవడంతో సభకు హాజరవ్వకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు కార్యక్రమ ముఖ్య అతిథి అయిన జంకె వెంకటరెడ్డికి స్థానం కేటాయించకపోవడంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా ఆయన వెంటే వెనుదిరిగి వెళ్లిపోయారు.