మార్కాపురం నియోజకవర్గ ఓటర్ల దారి ఏ వైపుకు ?….. రాజకీయ విశ్లేషకులకు కూడా అర్ధం కాని పరిస్థితి!
ఇప్పుడు మార్కాపురం నియోజకవర్గ ప్రజల నాడీ పట్టడం ఏ రాజకీయ అంచనాలకు అందడంలేదు అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ప్రస్తుత రాజకీయ సమీకరణాలు, పరిణామాలను చూస్తే అలానే అనిపించక మానదు కూడా……
ప్రస్తుతం నియోజవర్గంలో తెదేపా, వైకాపా అభ్యర్థుల మధ్య తీవ్రపోటీ నెలకొనగా నువ్వానేనా అనే రీతిలో ఓటర్లను తమవైపుకు మలచుకునే పనిలో అభ్యర్థులు మునిగిపోయారు.
ఇంతవరకు వైసీపీలో కొనసాగిన యువ నాయకులు, సీనియర్ నాయకులు టిడిపిలో చేరితే…… మేమేమైనా తక్కువా అనే రీతిలో టిడిపి నాయకులు కూడా వైసీపీలో చేరుతున్నారు. ఇదిలా ఉండగా జనసేనపార్టీ అభ్యర్థి కూడా తమ కూటమి అయిన వామపక్షాలు మద్ధతుతో వారిదైన శైలిలో ఓటర్లని ఆకర్షిస్తూ గట్టిపోటీనే ఇవ్వబోతోంది. దీనికి దీటుగానే కాంగ్రెస్ అభ్యర్ధి కూడా ఓటర్లను బాగానే ప్రభావితం చేస్తుండడంతో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.
అయితే అభ్యర్థులు పార్టీలో చేర్చుకునే విషయంలో తలమునకలై వేరే పార్టీలో నుండి వారి పార్టీలోకి వారికి వరాల జల్లు కురిపిస్తూ ప్రలోభపెడుతూ వారికి కావలసిన సకల సౌకర్యాలు ఏర్పాటు చేసి వారి ద్వారా ఓటర్లను ప్రభావితం పరిస్థితి ఏర్పడింది.
అయినా కూడా ఇప్పుడు ప్రధాన పార్టీలకు వచ్చిపడిన పెద్ద చిక్కు ఏంటంటే వామపక్ష కూటమితో కూడిన జనసేన పార్టీ…… అలాగే 2014లో ఆదరణ పొందలేకపోయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా ఓటర్లును తమ వైపుకు మలచుకునే ప్రయత్నాలు చేయడంతో ఇప్పుడు ప్రధాన పోటీదారులు అయిన వైసిపి, టిడిపి అభ్యర్థుల ఓటుబ్యాంకుకు భారీగానే గండిపడిందని…… ఏదేమైనా నిబద్ధత కలిగిన నాయకులకు పార్టీలో సముచిత స్థానం లభించకపోవడం అలాగే పైపై మెరుగులతో తిరిగే నాయకులు పెత్తనం చేయడం వంటి అంశాలు ప్రభావం చూపించే అవకాశం ఉందని…… ఇప్పటి ఎన్నికలలో ఓటర్లనే కాక నాయకులు, మద్దతు దారులు చివరి నిమిషంలో ఎలాంటి షాక్ ఇస్తారో కూడా అర్ధంకాని పరిస్థితి నెలకొందని….. ఓటర్లు కూడా ఇంతకు ముందులా లేరని పోలింగ్ బూత్ లోనికి వెళ్ళాక తాము అనుకున్నదే చేస్తారు కానీ బయట ఉన్నట్లు ఉండరని కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.