Tv9 సిఇఓ రవిప్రకాశ్ పై సైబర్ క్రైమ్ కేసు నమోదు సిఇఓ పదవిని నుండి తొలగించిన టీవీ9 యాజమాన్యం
యాజమాన్యానికి తెలియకుండా నిధుల మళ్లించారంటూ టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌పై సైబర్ క్రైమ్‌లో కేసు నమోదు అయింది. ఈ నేపథ్యంలో ఆయన కోసం రెండు రోజుల నుంచి తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు. నిధుల మళ్లింపు జరిగిందని ఆరోపిస్తూ అలంద మీడియా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ…సీఈవోపై ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా తన సంతకాన్ని రవిప్రకాశ్ ఫోర్జరీ చేశారంటూ అలంద మీడియా కార్యదర్శి కౌశిక్ రావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలంద సంస్థ ఫిర్యాదుతో రవిప్రకాశ్ నివాసంతో పాటు టీవీ9 కార్యాలయంలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు.
కాగా కొద్దిరోజుల కిందటే ఏబీసీఎల్ కార్పొరేషన్ నుంచి 90శాతం షేర్లు కొనుగోలు చేసి టీవీ9ను అలంద మీడియా టేకోవర్ చేసిన విషయం తెలిసిందే. యాజమాన్యం మారిన తర్వాత కొత్తగా నలుగురు డైరెక్టర్లను తీసుకోవాలని అలంద మీడియా ప్రతిపాదించింది. డైరెక్టర్ల నియామకానికి కేంద్ర సమచారశాఖ అనుమతి ఇచ్చినా… ఆ ప్రతిపాదనను రవిప్రకాశ్ వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా డైరెక్టర్ల నియామకాన్ని వ్యతిరేకిస్తూ బోర్డు మీటింగ్‌లో కొత్తవారిని తీసుకోవద్దంటూ ప్రతిపాదిస్తూ ఇప్పటికే ఉన్న ఓ డైరెక్టర్ సంతకంతో డాక్యుమెంట్ తయారు చేయించి, రవిప్రకాశ్ అక్రమాలకు పాల్పడ్డారని సమాచారం. ఇక టీవీ9 కార్యాలయం నుంచి కొన్ని ఫైల్స్, ల్యాప్‌టాప్‌తో పాటు హార్డ్‌డిస్క్‌లు మాయం అయినట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న రవిప్రకాశ్‌తో పాటు ఆయన అనుచరుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.