దర్శి మాజీ శాసనసభ్యులు బూచేపల్లి కన్నుమూత…
దర్శి మాజీ శాసనసభ్యులు బూచేపల్లి సుబ్బారెడ్డి (69) హైదరాబాదు లోని యశోదా హాస్పిటల్ నందు వైద్యసేవలు అందుకుంటూ శనివారంనాడు ఉదయం 10గంటల సమయంలో కన్నుమూశారు.
చీమకుర్తి గ్రానైట్ పరిశ్రమలో తనకంటూ ఓ పేరు ప్రఖ్యాతలు సంపాదించున్న సూర్యా గ్రానైట్స్ అధినేత బూచేపల్లి సుబ్బారెడ్డి(69) శనివారం నాడు హైదరాబాదులోను యశోదా హాస్పిటల్ నందు తుదిశ్వాస విడిచారు.
చీమకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా రాజకీయ రంగప్రవేశం చేసిన ఆయన చీమకుర్తి మండలంలోని ప్రజలకు ఉచిత ఆయుర్వేద ఆసుపత్రి, తాగునీటి సదుపాయంకోసం ట్యాంకర్లను ఏర్పాటు చేయడం వంటి ఎన్నో అభివృద్ధి పనులను బూచేపల్లి వెంకాయమ్మ సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్టు ద్వారా నిర్వహించి పేదలకు ఆశాజ్యోతిగా నిలిచారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ తరుపున శాసనసభ టికెట్ ఆశించిన ఆయనకు అధిష్టానం టికెట్ కేటాయించక పోవడంతో దర్శి నియోజకవర్గ శాసనసభ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా విమానం గుర్తుపై 2004లో తెదేపా అభ్యర్థి కదిరి బాబూరావుపై 1600మెజారిటీతో గెలుపొందారు . మరలా ఆయన గెలువును కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. అప్పటి దర్శి నియోజకవర్గంలో కలిసిఉన్న పొదిలి మండలంలో ఆయనకు మద్దతుగా పని చేసిన పొదిలి మండల నాయకుల అభీష్టం మేరకు పొదిలిలోని అయ్యప్పస్వామి దేవస్థానాన్ని ఆయన స్వంతనిధులను కేటాయించి నిర్మించారు.
ఆ తరువాత 2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరుపున తన కుమారుడైన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని రంగంలోకి దింపిన ఆయన గెలుపుకై ఎంతో కృషిచేసి ఎట్టకేలకు తన కుమారుడిని కూడా 2009ఎన్నికలలో భారీ మెజారిటీ సాధించడానికి ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలే నిదర్శనంగా చెప్పవచ్చు.
అయితే గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చెన్నై మరియు హైదరాబాద్ లలో చికిత్స పొందుతున్న ఆయన శనివారంనాడు ఉదయం కన్నుమూశారని తెలియగానే కుటుంబ సభ్యులు, చీమకుర్తి మండల ప్రజలు, ఇటు దర్శి నియోజకవర్గ ప్రజలే కాక జిల్లాలోని ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.