పొదిలిటైమ్స్ కథనానికి స్పందించిన యువత… చిన్నచెఱువు ఆక్రమణలపై ఎంఎల్ఏ కు ఫిర్యాదు
పొదిలిటైమ్స్ కథనానికి స్పందించి చిన్నచెఱువు ఆక్రమణలపై పట్టణ యువత ఎంఎల్ఏ కు ఫిర్యాదు చేశారు.
వివరాల్లోకి వెళితే పట్టణంలోని చిన్నచెఱువులో సుమారు 70ఎకరాలకుపైగా ఆక్రమించుకుని పంటపొలాలుగా మార్చి సాగుచేస్తున్న విషయంపై ఇటీవల “పొదిలిటైమ్స్”లో వచ్చిన కథనానికి పొదిలి ప్రజలలో కదలిక మొదలైంది.
ప్రస్తుతం పొదిలి ప్రజలు ఎదుర్కొంటున్న నీటిసమస్యపై నడుంబిగించిన పట్టణ యువత స్థానిక మండల రెవిన్యూ తహశీల్దార్ కార్యాలయంలో భూ సమస్యలపై ఏర్పాటు చేసిన ప్రత్యేక స్పందన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డిని కలిసి చిన్నచెఱువును కబ్జాదారులనుండి కాపాడాలని…. పొదిలి ప్రజలు తీవ్ర నీటిసమస్యతో అల్లాడిపోతున్నారని…. ఈ సమస్య తీరాలంటే చిన్నచెఱువు ఆక్రమణలు తొలగించి నీటినిల్వకు అనువుగా మార్చాలని….. అదేవిధంగా చిన్నచెఱువుకు నీరు చేరాలంటే అక్రమంగా ఎక్కడికక్కడ ఏర్పాటు చేసిన చెక్ డ్యాములను తొలగించాలని వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కుందూరు నాగార్జునరెడ్డి మాట్లాడుతూ చిన్న చెఱువు భూములపై విచారణకు ఆదేశాలు జారీచేసి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.