మృత్యుశకటాలుగా మారిన గుంతలు…. ఆదమరిస్తే అంతే సంగతులు

పట్టణంలోని ప్రధాన రహదారి అయిన ఒంగోలు-కర్నూలు రాష్ట్ర రహదారిపై ఏర్పడిన గుంతలు ప్రయాణికుల పట్ల మృత్యుశకటాలుగా మారాయి. ఇంక ప్రయాణికులు ఒక్క నిమిషం ఆదమరిస్తే ఇంకేముంది అంతే సంగతులు.

వివరాల్లోకి వెళితే పట్టణంలోకి ప్రవేశించగానే ప్రయాణికులకు గుంతలు స్వాగతం పలుకున్నాయి. రాష్ట్ర ప్రధాన రహదారి అయిన ఒంగోలు-కర్నూలు రహదారిపై నిత్యం వేల సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో రహదారులు మరియు భవనముల శాఖ అధికారులు అప్పుడప్పుడు పర్యవేక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే ఈమధ్య కాలంలో అధికారులు ఏమయ్యారో తెలియట్లేదంటూ ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రయాణికులు మరియు స్థానికుల కథనం ప్రకారం….. స్థానిక చిన్నబస్టాండులోని ఇండియన్ ఆయిల్ పెట్రోలు బంకు సమీపంలో నుండి చిన్న బస్టాండు సెంటర్ వరకు 3 ప్రమాదభరితమైన గుంతలు ఏర్పడగా వాహనదారులను ఇబ్బంది పెట్టే విధంగా చిన్నచిన్న గుంతలు చాలానే ఉన్నాయి….. అలాగే మార్కాపురం అడ్డరోడ్డు నుండి బస్టాండు వరకు ఏర్పడిన గుంతలకు ఇటీవల రహదారులు మరియు భవనముల శాఖ అధికారులు పైపై మెరుగులుదిద్ది తమ పని అయిపోయిందని చేతులు దులుపుకున్నారు. అవికూడా మోకాళ్ళలోతుగా గుంతలు మారి ప్రయాణికులకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది….. అలాగే ఇటీవల తొలగించిన స్పీడు బ్రేకర్లకు మరలా తారు(డాంబర్)తో పూడ్చాల్సి ఉండగా అలా చేయకపోవడంతో అవికూడా గుంతలుగా మారిపోయాయి.

ఇదిలా ఉంచితే ఇటీవల కురుస్తున్న వర్షాలకు గుంతలు పెద్దవి అవడమే కాకుండా నీటితో నిండిపోయి ఉండడంతో ప్రమాదాలు కూడా జరిగాయని వాహనచోదకులు తెలుపగా…. అధికారులు పట్టించుకోవడం లేదని అందుకే మాకు దొరికిన టైర్లు, రాళ్లు, బోర్డులు వంటివి ఏర్పాటు చేస్తున్నామని అన్నివేళలా ఇది సరైన పద్ధతి కాకపోయినప్పటికి వాహనచోదకులు వాటిని చూసి అప్రమత్తమవుతారని ఏర్పాటు చేసినట్లు స్థానికులు అంటున్నారు.

ఏదేమైనప్పటికి అధికారులు నిమ్మకునీరెత్తినట్లు ఉండకుండా ప్రజల ప్రాణాల గురించి కూడా ఆలోచించి… తక్షణమే మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.