ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూత
వేణుమాధవ్ రెండు కిడ్నీలు పూర్తిగా దెబ్బతినడంతో మంగళవారం ఆయన ఆరోగ్యం విషమించింది. సమాచారం అందుకున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరి జీవిత రాజశేఖర్‌తో పాటు ఉత్తేజ్, మా కార్యవర్గ సభ్యుడు సురేశ్ కొండేటి, టాలీవుడ్‌కు చెందిన పలువురు కమెడియన్స్ హాస్పిటల్‌లో వేణుమాధవ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అనంతరం ఆయన ఆరోగ్యం ఇవాళ మరింత విషమించి మధ్యాహ్నం 12.21 గంటలకు తుదిశ్వాస విడిచారు. వేణుమాధవ్ మృతితో చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది.
సూర్యపేట జిల్లా కోదాడలో 1969 డిసెంబర్ 30న జన్మించిన వేణుమాదవ్ మిమిక్రీ ఆర్టిస్టుగా, హాస్య నటుడిగా, కథానాయకుడిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు.
1996లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కృష్ణ హీరోగా నటించిన ‘సంప్రదాయం’ చిత్రంతో సినీరంగంలోకి అడుగుపెట్టారు.
ఆ తర్వాత పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘తొలిప్రేమ’ మంచి బ్రేక్ ఇచ్చింది.
ఇక తనను నటుడిగా పరిచయం చేసిన ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘హంగామా’ సినిమాతో హీరో అయ్యాడు.
ఆ తర్వాత ‘భూకైలాస్’, ‘ప్రేమాభిషేకం’ వంటి పలు సినిమాల్లో హీరోగా నటించాడు. ‘యువకుడు’, ‘దిల్’, ‘లక్ష్మి’, ‘సై’, ‘ఛత్రపతి’, ‘మాస్’ చిత్రాలు కమెడియన్‌గా మంచిపేరు తీసుకొచ్చాయి.
2006లో వెంకటేశ్ హీరోగా.. వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లక్ష్మి’ సినిమాకుగాను ఉత్తమ హాస్యనటుడిగా వేణుమాదవ్ ‘నంది’ పురస్కారాన్ని అందుకున్నారు.
ఏది ఏమైనా ఓ ప్రముఖ హాస్యనటుడుని కొల్పివడం తెలుగు చలనచిత్రసీమకు ఒక దురదృష్టమనే చెప్పాలి.