మోడీకి ఘనస్వాగతం
రెండవసారి ప్రధాని అయ్యాక తొలిసారి అమెరికా వెళ్లిన ప్రధాని మోడీ.. హ్యూస్టన్‌లో జరిగిన #HowdyModi# సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలసి పాల్గొన్నారు. ఆ తర్వాత అమెరికన్ కంపెనీల సీఈవోలతో బ్లూమ్‌బర్గ్ బిజినెస్ సమ్మిట్‌లో పాల్గొన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కంపెనీలను ఆహ్వానించారు. ఈనెల 27న ఐరాస సాధారణ అసెంబ్లీ 74వ సదస్సులో ప్రసంగించిన ప్రధాని మోడీ గత ఐదేళ్లలో భారత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. రాబోయే రోజుల్లో నిర్దేశించుకున్న లక్ష్యాలను వెల్లడించారు. ఉగ్రవాదం వల్ల భారత్‌కు మాత్రమే కాదని, ప్రపంచమానవాళి నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పాకిస్తాన్, కాశ్మీర్ పేరును ప్రస్తావిచకుండా ఉగ్రవాదంపై ప్రసంగించారు.
అమెరికా పర్యటన విజయవంతంగా ముగించుకుని భారత్ కు విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోడీకి ఘనస్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశాయి. విమానాశ్రయం వద్దకు వేలాదిగా బీజేపీకార్యకర్తలు తరలివచ్చి మోడీ నినాదాలతో విమానాశ్రయ పరిసరాలు మార్మోగిస్తున్నారు. సుమారు రెండు కిలోమీటర్ల మేర ప్రధాని మోడీ రోడ్ షో కొనసాగనుంది. ఒక కిలోమీటర్ దూరం ప్రధాని మోదీ నడుస్తూ వెళ్తారు. తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన వారికి అభివాదం తెలుపుతారు. అనంతరం ఓపెన్ టాప్ జీపులో ప్రయాణించనున్నారు. విమానాశ్రయం నుంచి ప్రధాని మోడీ నివాసం లోక్ కల్యాణ్ మార్గ్ వరకు ప్రధాని మోడీకి అడుగడుగునా నీరాజనం పట్టేందుకు ప్రజలు, బీజేపీ కార్యకర్తలు తరలివచ్చారు.
నరేంద్ర మోడీకి ఘనస్వాగతం పలికే క్రమంలో భాగంగా భారీగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేశారు. దేశంలోని భిన్న సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా, నృత్యాలు, డప్పు చప్పుళ్లు, బ్యాండ్ బాజాలతో మోడీకి స్వాగతం పలకనున్నారు.