కంటివెలుగు కార్యక్రమం ప్రారంభించిన తహశీల్దార్ ప్రభాకరరావు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమాన్ని గురువారంనాడు మండల రెవిన్యూ తహశీల్దార్ ప్రభాకరరావు ప్రారంభించారు.

వివరాల్లోకి వెళితే స్థానిక పెద్దబస్టాండులోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన కంటివెలుగు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మండల రెవిన్యూ తహశీల్దార్ ప్రభాకరరావు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ “సర్వేంద్రియానాం నయనం ప్రధానం” జీవి అన్ని ఇంద్రియాలలో కళ్ళు ప్రధానమైనవి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమం ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు. అనంతరం కంటివెలుగు కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా డాక్టర్ రాధాకృష్ణ మాట్లాడుతూ కంటివెలుగు కార్యక్రమాన్ని ఆరు దశలుగా విభజించడం జరిగిందని…మొదటిదిశగా 10వతేది నుండి 16వతేది వరకు అన్ని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కంటివెలుగు స్క్రీనింగ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని రెండవ దశలో దృష్టిలోపంతో బాధపడుతున్న పిల్లలకు నిపుణుల ద్వారా శస్త్రచికిత్సలు నిర్వహించడం జరుగుతుందని….. అలాగే 3వదశ నుండి 6వదశ వరకు ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారి శ్రీనివాసరెడ్డి, ఈఓఆర్డీ రాజశేఖర్, వైసీపీ నాయకులు సాయి రాజేశ్వరరావు, నరసింహారావు, ఖాసీం, వర్షం ఫిరోజ్, గౌస్ తదితరులు పాల్గొన్నారు.