ప్రేమను పెళ్లిగా మలచుకున్న అరకు ఎంపీ
16సంవత్సరాల స్నేహం అది ప్రేమగా మారింది.. ఆ ప్రేమ పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో జంట ఒక్కటి కాబోతున్న ఆ జంట ఆనందానికి అవధులు లేవు… ఇలా ఎంతోమంది జీవితాల్లో ఇప్పటివరకు మరి విశేషం ఏంటని అనుకుంటున్నారా?
మన రాష్ట్రానికే చెందిన అరకు ఎంపీ గొట్టేటి మాధవి ప్రేమ పెళ్లికూతురుగా ముస్తాబవుతుండడమే ఇక్కడ విశేషం.
తన పదహారేళ్ల ప్రేమను.. వివాహ బంధంగా మార్చుకోబోతున్నారు…. ఎస్ టీ థెరీసా విద్యాసంస్థల నిర్వాహకుడు కుసిరెడ్డి శివప్రసాద్‌ను మరో వారంలో ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు.
ఐదో తరగతి నుంచి కలిసి చదువుకున్న వీరిరువురు మొదట ప్రాణ స్నేహితులలా… ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు.
ఎంపీ మాధవి తండ్రి దివంగత మాజీ ఎమ్మెల్యే దేముడు, శివప్రసాద్ తండ్రి నారాయణమూర్తిలు ఇరువురు కూడా స్నేహితులు కావడంతో ఇద్దరి బంధం మరింత బలపడింది.
ఒకరికొకరు అభిప్రాయాలు గౌరవించుకుంటూ.. ఒకరికొకరు తోడుగా నిలుస్తూ ప్రేమలోనే కాదు ఉన్నత స్థానానికి చేరడంలోనూ జీవితంలోనూ విజయవంతమయ్యారు.
బీఎస్సీ, బీపీఈడీ చదివిన మాధవి.. ఒప్పంద పద్ధతిలో పీఈటీ టీచర్‌గా పనిచేశారు. శివ ప్రసాద్.. ఎస్‌టీ థెరిసా విద్యా సంస్థల కరస్పాండెంట్‌గా, శివ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్‌గా ఉన్నారు.
అనూహ్యంగా ఈ ఏడాది జరిగిన ఎన్నికల ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన మాధవి….. రాజకీయ కురువృద్ధుడు కిశోర్ చంద్రదేవ్‌ను అత్యధిక మెజారిటీతో ఓడించి….. రాష్ట్రంలో చిన్న వయసులోనే ఎంపీగా లోక్‌సభలో అడుగుపెట్టారు.
ఎన్నికల సమయంలోనూ మాధవి తరుపున శివప్రసాద్ ఎన్నికల ప్రచారం నిర్వహించడం గెలుపుకు ప్రధాన కారణమవ్వడం వీరిద్దరి మధ్య ప్రేమ మరింతగా బలపడగా.. జంటగా ఒక్కటవ్వాలని నిశ్చయించుకున్నారు.
ఇరు కుటుంబాల పెద్దల ముందు తమ పెళ్లి ప్రతిపాదన చేశారు. పెళ్లికి కులం అడ్డుగోడగా నిలిచినా… పెద్దలు తమ బాధ్యతను అర్థం చేసుకున్నారు. పిల్లల ఆలోచనను సమ్మతించి వారి వివాహ ప్రతిపాదనను అంగీకరించారు.
ఈ నెల 17న అరకు ఎంపీ మాధవి స్వగ్రామమైన… విశాఖ జిల్లా కొయ్యూరు మండలం శరభన్నపాలెంలో రాత్రి 3 గంటల 15 నిముషాలకు వివాహం జరగనుంది.