తహశీల్దార్ విజయారెడ్డి గతే మీకు కూడా…. పొదిలి తహశీల్దార్ కు బెదిరింపులు
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డిజిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డిని సోమవారంనాడు పెట్రోలు పోసి కాల్చివేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది…….
అయితే తహశీల్దార్ హత్యలో నిందితులను కఠినంగా శిక్షించాలని ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల రెవిన్యూ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో ఇదే అదునుగా భావించిన కొందరు సోషల్ మీడియాలో అధికారులను బెదిరిస్తూ సందేశాలను పంపుతున్నారు…….
ఈ నేపథ్యంలో పొదిలి తహశీల్దార్ ప్రభాకరరావును బెదిరిస్తూ “తెలంగాణలో తహశీల్దార్ కు పట్టిన గతే పడుతుందని” “అందరూ రైతులు కాళ్ళు మొక్కరు కాల్చేసే వాళ్ళు కూడా ఉంటారు” “రెవిన్యూ అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాలని” హైదరాబాదులో పోలీస్ శాఖ నందు పని చేస్తున్నట్లు సమాచారం కంభాలపాడు గ్రామానికి చెందిన అంబటి కృష్ణారెడ్డి అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేసిన సందేశంతో పొదిలి రెవిన్యూ ఉద్యోగులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు.
ఈ విషయంపై పొదిలి తహశీల్దార్ ప్రభాకరరావు మాట్లాడుతూ జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని….. ఒక ప్రభుత్వ ఉద్యోగి అయిన పోలీస్ కానిస్టేబుల్ సోషల్ మీడియాలో మండల మెజిస్ట్రేట్ ను బెదిరించడం సరికాదని…… మా పరిధిలో ఏమైనా పనులు చేయకపోతే పై అధికారులు దృష్టికి తీసుకుని వెళ్ళవచ్చునని…… అంతేకాని బెదిరింపులు, హెచ్చరికలు జారీ చేయడంపై ఉపేక్షించేది లేదని తెలిపారు. ఇప్పటికే ఈ విషయాన్ని జిల్లా కలెక్టరు దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగిందని అలాగే జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు వారి దృష్టికి కూడా తీసుకువెళ్లడం జరిగిందని….. పోలీసులు ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.