కర్ణాటక ఉప ఎన్నికలలో బిజెపి12 కాంగ్రేస్ 2 బిజెపి రెబల్ 1
కర్ణాటకలో ఉప ఎన్నికల్లో బిజెపి హావా చూపటంతో బిజెపి శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. వివరాలు లోకి వెళితే కర్ణాటక శాసనసభ కు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ 12 చోట్ల విజయం సాధించిగా కాంగ్రెస్ 2 చోట్ల బిజెపి రెబల్ (హోస్కోట్లో స్వతంత్ర అభ్యర్థి శరత్ గౌడ్ ) ఘన విజయం సాధించారు.
కనీసం 6 శాసనసభ స్థానాలు గెలిస్తేనే యడ్యూరప్ప ప్రభుత్వం అధికారంలో కొనసాగే అవకాశాలు ఉన్న సమయంలో… ఏకంగా 12 స్థానాలు దక్కడంతో… ఇక యడ్యూరప్ప కుర్చీకి ఇప్పట్లో కుదుపులు లేనట్లే అనుకోవచ్చు.
మొత్తం 225 స్థానాలున్న కర్ణాటక శాసనసభలో కాంగ్రెస్-జేడీఎస్‌కు చెందిన 17 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ రమేష్ కుమార్ అనర్హత వేటు వేయడంతో సభ్యుల సంఖ్య 208కి చేరింది. దానితో 105 స్థానాలున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం నిలబడాలంటే ఆ పార్టీ కనీసం 6 స్థానాల్లో తప్పక విజయం సాధించాలసిన పరిస్థితి ఏర్పడింది.
కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి పరోక్షంగా బీజేపీకి సహకరించిన రెబల్స్ ప్రస్తుతం బీజేపీ తరఫున ఎన్నికల్లో పోటీచేశారు. 17 స్థానాల్లో రెండు స్థానాలను పక్కన పెట్టి… 15 సీట్లకు పోలింగ్ జరపగా… వాటిలో బీజేపీకి 12 స్థానాలు గెలుపొందటంతో యడ్యూరప్ప నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తి మెజార్టీ సాధించినట్లే. ఈ ఫలితాల వల్ల అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కూడా ప్రతిపక్షాలు ఆసక్తి చూపలేని పరిస్థితి ఉంది. ఈ ఫలితాలతో కాంగ్రెస్, జేడీఎస్ కూటమి మరింత డీలా పడినట్లైంది.