బిసి యువతిపై అత్యాచారం చేసిన యువకుడిపై దిశ చట్టం అమలు చేయాలి : అఖిల భారత యాదవ మహాసభ డిమాండ్
బిసి యువతిపై అత్యాచారం చేసిన యువకుడిపై తక్షణమే దిశ చట్టంతో కేసు నమోదు చేసి బాధితురాలికి న్యాయం చేయాలని అఖిల భారత యాదవ మహాసభ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
వివరాల్లోకి వెళితే స్థానిక యాదవ మహాసభ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు పొల్లా నరసింహ యాదవ్ మాట్లాడుతూ శనివారం రాత్రి త్రిపురాంతకం మండలం రాజుపాలెం గ్రామంలో తన తల్లిదండ్రులు కూలి పనుల నిమిత్తం పనులకు వెళ్లగా ఇంట్లో ఎవరూలేని సమయంలో ఒంటరిగా ఉన్న యువతిపై ఇంటి ప్రక్కనే నివాసం ఉండే కరుణాకర్ రెడ్డి అత్యాచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ….. తక్షణమే నిందితుడిపై దిశా చట్టం ప్రకారం కేసు నమోదు చేసి బాధితురాలికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అఖిల భారత యాదవ మహాసభ జిల్లా కార్యదర్శి బాబురావు యాదవ్ మాట్లాడుతూ బిసి యువతిపై అత్యాచారం చేసిన నిందితుడిని రక్షించేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని…. తక్షణమే స్థానిక శాసనసభ్యులు మరియు రాష్ట్ర మంత్రివర్యులు అయిన ఆదిమూలపు సురేష్ జోక్యం చేసుకుని బాధిత కుటుంబానికి అండగా ఉండి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
యాదవ మహాసభ నాయకులు కనకం వెంకట్రావు యాదవ్ మాట్లాడుతూ దిశా నిందితులను ఎన్ కౌంటర్ చేసినట్లు ఎన్ కౌంటర్ చేసి బిసిల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని నిరూపణ చేసుకోవాలి….. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు.
రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం కార్యదర్శి పొల్లా నరసింహారావు, అఖిల భారత యాదవ మహాసభ జిల్లా కార్యదర్శి మూరబోయిన బాబు రావు, మండల నాయకులు కనకం వెంకట్రావు, శ్రీను, రాంబాబు, సుబ్బారావు, పెమ్మని రాజు ,మువ్వా రాజు, సిరిమల్లె శ్రీను, బోగాని సుబ్బారావు మరియు భారత యాదవ మహాసభ నాయకులు తదితరులు పాల్గొన్నారు.