ఏప్రిల్ నుంచి దేశవ్యాప్తంగా జాతీయ జనాభా జాబితా
జాతీయ జనాభా జాబితా (ఎన్‌పీఆర్) తయారు చేసేందుకు మంగళవారం నాడు సమావేశమైన కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీని కోసం రూ.8,500 కోట్లు కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది.
ఇటీవల పౌరసత్వ సవరణ చట్టం తీసుకొచ్చిన మోదీ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా జాతీయ జనాభా పట్టిక (నేషనల్ పాపులేషన్ రిజిస్టర్- NPR) చేపట్టాలని కేంద్ర కేబినెట్ మంగళవారం నిర్ణయించింది. దీని ద్వారా దేశ పౌరులందరి సమాచారాన్ని అప్‌డేట్ చేయనుంది. జాతీయ జనగణన రిజిస్టర్ (ఎన్‌పీఆర్) కోసం ఎటువంటి పత్రాలు అవసరం లేదనీ.. సెల్ఫ్ సర్టిఫికెట్ ఇస్తే చాలని మంత్రి ప్రకాశ్ జావడేకర్ స్పష్టంచేశారు. బయో మెట్రిక్ వివరాలు, ఆధార్ సహా ఎటువంటి పత్రాలూ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఎన్‌ఆర్‌సీకి దీనికి ఎలాంటి సంబంధమూ లేదని తేల్చి చెప్పారు. ప్రతి పదేళ్లకు ఒకసారి జరిగే జనాభా లెక్కల ప్రక్రియే తప్ప కొత్తదేమీ కాదన్నారు. జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్‌పీఆర్)ను అప్‌డేట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.3941 కోట్ల నిధుల్ని కేటాయించింది. గతంలో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ-2 ప్రభుత్వం కూడా 2010లో తొలిసారి ఎన్‌పీఆర్ చేపట్టి గుర్తింపు కార్డులను మంజూరు చేసింది. ఆ సమాచారాన్ని 2015లో అప్‌డేట్ చేశారు. ఎన్‌పీఆర్ ద్వారా దేశంలోని సాధారణ నివాసితుల జాబితాను అప్‌డేట్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రక్రియను ఎప్పటినుంచి చేపడతారు? ఎక్కడెక్కడి ప్రజల సమాచారం ఏవిధంగా సేకరిస్తారు? తదితర అంశాలను ఒక్కసారి పరిశీలిస్తే..
ఎప్పట్నుంచి?
2020 ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. జనాభా సమాచారాన్ని మునుపటిలాగానే గ్రామ, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో సేకరిస్తారు. గడిచిన ఆరు నెలలుగా ఒక ప్రాంతంలో నివసిస్తున్నవారిని, లేదంటే రానున్న ఆరు నెలల పాటు అదేచోట ఉంటామని చెప్పిన వారిని స్థానికులుగా పరిగణిస్తారు. దేశవ్యాప్తంగా జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్) కార్యక్రమం ద్వారా ప్రతి పౌరుడి వివరాలు తెలుసుకుంటారు.
దేశంలోని నిజమైన పౌరుల వివరాలు సేకరించడమే ఎన్‌పీఆర్ లక్ష్యం. దేశ అంతర్గత భద్రతను దృష్టిలో ఉంచుకొని చేపడుతున్న ఈ ప్రక్రియలో ప్రజలందరి వేలి ముద్రలు సేకరించడం, అందరికీ పౌరసత్వ గుర్తింపు కార్డులు ఇవ్వడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు సమర్థంగా చేరవేయడమే దీని లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది.
అసోం మినహా దేశమంతా..
ఎన్‌పీఆర్ ప్రక్రియను అసోం మినహా దేశంలోని అన్ని రాష్ట్రాలూ, కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్వహిస్తారు. అసోంలో విదేశాల నుంచి అక్రమ చొరబాటుదారులను గుర్తించే లక్ష్యంతో ఎన్‌ఆర్‌సీ నిర్వహించిన నేపథ్యంలో అక్కడ ఈ ప్రక్రియ చేపట్టేందుకు మినహాయింపు ఇచ్చారు.
ఏయే వివరాలు సేకరిస్తారు?
వ్యక్తి పేరు, ఇంటి పెద్దకు ఏమవుతారు? వ్యక్తి తల్లిదండ్రుల పేర్లు, జీవిత భాగస్వామి పేరు (పెళ్లైతే), లింగం, పుట్టిన తేదీ, ఎక్కడ పుట్టారు? జాతీయత, ప్రస్తుత చిరునామా, శాశ్వత చిరునామా, వృత్తి, విద్యార్హతలు.. ఇలా వ్యక్తిగత వివరాలను అడుగుతారు.
రాష్ట్ర ప్రభుత్వాలు కాదనొచ్చా?
పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు జరుగుతున్న దృష్ట్యా జనాభా పట్టిక రూపకల్పన కార్యక్రమాలను నిలిపివేస్తున్నట్టు కేరళ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇలాంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని కేంద్ర హోం శాఖ అధికారులు చెబుతున్నారు. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ అధికార పరిధిలోకి వస్తుందంటున్నారు.
సమాచారం భద్రమేనా?
ఎన్‌పీఆర్ ద్వారా సేకరించిన ప్రజల సమాచారాన్ని భద్రంగా ఉంచుతారు. దీన్ని ప్రజా బాహుళ్యానికి అందుబాటులో లేకుండా ప్రత్యేకంగా భద్రపరుస్తారు. లబ్ధిదారులకు సమర్థంగా సంక్షేమ పథకాలు చేరవేసే లక్ష్యంతో పాటు దేశ అంతర్గత భద్రతను మెరుగుపరచడంలో ఉన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఎన్‌పీఆర్ చేపడుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.