అగ్నిమాపక కేంద్రానికి స్థలం ఖరారు
పొదిలి పట్టణంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకు పట్టణంలోని పలుచోట్ల స్థలాలను పరిశీలించి పొదిలి పట్టణంలోని ఆర్&బి డిఈ కార్యాలయం ప్రక్కనే ఉన్న ప్రభుత్వ స్థలాన్ని సూచనాప్రాయంగా ఖరారు చేసినట్లు అగ్నిమాపక కేంద్రం జిల్లా అధికారి శ్రీనువాసులు పొదిలి టైమ్స్ కు తెలిపారు.
వివరాల్లోకి వెళితే పొదిలి పట్టణంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని గత 30సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్న పొదిలి ప్రజల కలసాకారం కాబోతుంది.
మంగళవారంనాడు అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించేందుకు జిల్లా అగ్నిమాపక కేంద్రం అధికారులు పొదిలి పట్టణంలోని హరికృష్ణ సినిమా హాలుకు వెళ్ళే దారిలోని రోడ్లు మరియు భవనముల శాఖ సహాయ ఇంజనీర్ కార్యాలయంలో ప్రక్కనే ఉన్న 25సెంట్లు భూమిని పరిశీలించిన అనంతరం విశ్వనాథపురం విద్యుత్ సబ్ స్టేషన్ ప్రక్కన ఉన్న ఒక ఎకరంపైగా భూమిని పరిశీలించిన అనంతరం తహశీల్దారు కార్యాలయానికి వెళ్లి తహశీల్దారు ప్రభాకరరావును కలిసి రెండు స్థలాలను పరిశీలించామని మీరు త్వరగా స్థలాన్ని కేటాయించాలని కోరారు. ఎంపిక చేసుకున్న రెండు స్థలాల్లో ఏది అనుకూలంగా ఉందో వివరిస్తే ఎంపిక చేసుకున్న స్థలాన్ని కేటాయిస్తామని తహశీల్దారు తెలుపగా ఆర్&బి డిఈ కార్యాలయం ప్రక్కనే ఉన్న 25సెంట్లు స్థలాన్ని కేటాయించాలని జిల్లా అగ్నిమాపక అధికారి సూచనప్రాయంగా తెలిపారు.
మొత్తం మీద ఎలాంటి రాజకీయ జోక్యాలు లేకపోతే పొదిలి ప్రజలు కోరుకుంటున్న అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు కల సాకారం అయ్యే అవకాశం ఉంది.
ఈ కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక శాఖ సహాయ అధికారి వీరభద్రం మరియు అగ్నిమాపక శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.