ఫిర్యాదు చేయడం పాపమా…. సమస్య అధికారులకు తెలుపడం నేరమా!
మంచినీటి సరఫరాలో కులవివక్షత
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో గ్రామ వాలంటీరుకే నీటి సరఫరా నిలిపివేత
అధికారులకు సమస్య విన్నమించుకున్నా పట్టించుకునే నాధుడే కరువు
అష్టకష్టాలు పడి ఆటోలో నీళ్ల పీపాతో వ్యవసాయ భూమి నుండి నీరు తెచ్చుకుంటున్న వాలంటీర్ కుటుంబం
నెలరోజులుగా నీటికోసం నానా అవస్థలు పడుతున్నా పట్టించుకున్న పాపాన పోని అధికారులు
ఆమె ఒక గ్రామ వాలంటీర్ తనకు కేటాయించిన 50ఇళ్లకు సంబంధించి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లి పథకాల అమలులో కీలక పాత్ర పోషించే గ్రామ వాలంటీరుకు మాటతిప్పని మడమతిప్పని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉపాధి కల్పనలో మానస పుత్రికైన గ్రామ వాలంటీర్ వ్యవస్థలో పని చేసే వాలంటీరుకు వచ్చిన కష్టం తీర్చేది ఎవరు అనే ప్రశ్న ప్రస్తుతం ప్రశ్నగానే మిగిలింది.
వివరాల్లోకి వెళితే పొదిలి గ్రామ పంచాయతీ పరిధిలోని కాటూరి వారి పాలెం నందు గ్రామ వాలంటీరుగా పనిచేస్తున్న యుద్దం సావిత్రి తనకు కేటాయించిన 50ఇళ్లకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న మంచినీరు సరిగా రావడం లేదని పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేశారు…… దానికి స్పందించిన పంచాయతీ అధికారులు మంచి నీటి సరఫరా చేసే వ్యక్తిని మందలించడంతో సదరు విషయం మనసులో పెట్టుకున్న నీటి సరఫరా చేసే వ్యక్తి వాలంటీర్ కుటుంబం ఒక్కరికీ మాత్రమే నీటి సరఫరా నిలిపివేసి కుల వివక్షతకు పాల్పడంపై పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసి నేటికి నెల రోజుల కావస్తున్నా ఇప్పటికీ వాలంటీర్ కుటుంబంకు నీటి సరఫరా చేయకపోవడం పట్ల ఆ వాలంటీర్ కుటుంబం తీవ్రంగా కలత చెందుతుంది.
గ్రామంలోని ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కారానికి ఏర్పాటు చేయబడ్డ వాలంటీర్ వ్యవస్థలో…… తనకు కేటాయించిన ఇళ్ళకు సంబంధించి మంచినీటి సమస్యను విధి నిర్వహణలో భాగంగా అధికారులకు తెలుపడమే ఆ వాలంటీర్ చేసిన తప్పా అనే ప్రశ్న తలెత్తుతుంది.
అతి తక్కువ జీతంతో వాలంటీర్ ఉద్యోగాన్ని ఒక ఉద్యోగంలా కాకుండా సేవా దృక్పథంతో పనిచేయాలన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపుతో ప్రజలకు సేవచేసేందుకు ముందుకు వచ్చి వాలంటీర్లు పనిచేస్తున్నారని…… ప్రజల నీటి సమస్యను అధికారులు దృష్టికి తీసుకుని వెళ్లడమే ఒక శిక్షలా ఈ ఘటన ఉందని….. గత నెల రోజుల నుండి అష్టకష్టాలు పడుతూ ఆటోలో పిపా పెట్టుకుని నీరు తెచ్చుకుంటునే పరిస్థితి ఏర్పడడం అధికారులకు కనిపించలేదా?….. ఇప్పటికైనా అధికారులు కళ్ళుతెరిచి ఆ వాలంటీరుకు న్యాయం చేసి అధికారులు తమ వృత్తిధర్మాన్ని నిలబెట్టుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.