సమగ్ర శిక్ష అభియాన్ ఉపకరణాల పంపిణీ
సమగ్ర శిక్ష అభియాన్ పథకం కింద విభిన్న ప్రతిభావంతులైన పిల్లల పాఠశాలకు మంజూరైన ఉపకరణాలను స్థానిక విభిన్న ప్రతిభావంతులైన పిల్లల పాఠశాలకు (భవిత) విద్యార్థులకు మండల విద్యాశాఖ అధికారి కాకర్ల రఘురామయ్య పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు ఈ పరికరాల ద్వారా వినికిడి జ్ఞానం పొంది, భవిష్యత్తులో చదువులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, నడవలేని వారికి నడకకు తోడ్పాటు అందించే ఉపకరణాలు, ఇంటికి మాత్రమే పరిమితం కాకుండా విభిన్న ప్రతిభావంతులు చక్రాల కుర్చీలు ఉపయోగించుకొని దైనందిన జీవితంలో అవసరాలకు చైతన్యం పొందాలని, తల్లిదండ్రులు ప్రతి సోమవారం ఫిజియోథెరపీ సేవల ద్వారా పిల్లల శారీరక అవరోధాలు అధిగమించేలా చెయ్యాలని, వారు విభిన్న ప్రతిభావంతుల పట్ల శ్రద్ధతో వారి జీవితాలను సంరక్షించి సమాజంలో వారి పట్ల చిన్నచూపు తొలగించి వారిని సైతం సాధారణ విద్యార్థుల లాగా సమాజంలో ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాలని కోరారు.
సహాయం పొందిన తల్లిదండ్రులు మాట్లాడుతూ, తమ పిల్లల భవితలో వెలుగులు నింపుతున్న సమగ్ర శిక్ష పథకం అధికారులకు, భవిత సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
రిసోర్స్ పర్సన్ షేక్ షాహిదా బేగం మాట్లాడుతూ వినికిడి యంత్రాలు ఉపయోగించే విధానం తల్లిదండ్రులకి తెలిపారు, రిసోర్స్ పర్సన్ గోపాలకృష్ణయ్య కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా దాని నివారణకు మాస్క్ వాడకం, సామాజిక వ్యక్తిగత దూరం ఎలా పాటించాలి, చేతులు శుభ్రం చేసుకునే విధానం తెలిపారు ,హాజరైన విభిన్న ప్రతిభావంతుల వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యా వనరుల కేంద్రం సిబ్బంది హెచ్ఎం నాగరాజు, సి ఆర్ పి కిరణ్మయి , పొదిలి భవిత కేంద్రం రిసోర్స్ పర్సన్ గోపాలకృష్ణయ్య, షేక్ షాహిదా బేగం మరియు ఆయా నారాయణమ్మ పాల్గొన్నారు.