తన ఇంటిని సీజ్ చేయడంపై హైకోర్టును ఆశ్రయించిన హీరో ప్రభాస్
నందిని హిల్స్ లోని గెస్ట్ హౌస్ సీజ్,ఆక్రమిత స్థలంలో ఉందన్న రెవెన్యూ అధికారులు..స్టే కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన ప్రభాస్..ఆక్రమిత స్థలంలో ఉందంటూ తన గెస్ట్ హౌస్ ను శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు సీజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ హీరో ప్రభాస్ నేడు హైకోర్టును ఆశ్రయించారు.నందిని హిల్స్ లోని తన ఇంటికి తాళం వేసిన అధికారులు, నోటీస్ అంటించారని చెబుతూ, తాను ఇంటిని క్రమబద్ధీకరించుకునేందుకు దరఖాస్తు చేసివున్నానని, దానిపై నిర్ణయం వెలువడకుండానే ఎలా సీజ్ చేస్తారని ప్రశ్నించారు.రెవెన్యూ అధికారుల నిర్ణయంపై స్టే విధించాలని ప్రభాస్ తరఫున ఆయన న్యాయవాది పిటిషన్ ను దాఖలు చేయగా, నేడు అది విచారణకు స్వీకరించేందుకు న్యాయస్థానం అంగీకరించింది.కాగా, సర్వే నంబర్ 46లో ఉన్న 84 ఎకరాల భూమి ప్రభుత్వ స్థలమని గతంలోనే సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వగా, అధికారులు ఆ స్థలంలోని అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ..