పాక్ లో హిందు దేవాలయం కూల్చివేత…… దర్యాప్తుకు ఆదేశించిన ప్రధాని

కరాచీ: పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో కొంతమంది దుండగులు ఓ హిందూ దేవాలయాన్ని కూల్చివేయడంతో పాటు ఆలయంలోని పవిత్ర గ్రంథాలు, విగ్రహాలకు నిప్పుపెట్టారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ వెంటనే విచారణకు ఆదేశించారు. “ ఆలయం కూల్చివేత ఘటనపై సింధ్ ప్రభుత్వం వెంటనే విచారణ జరపాలి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ చర్య ఖురాన్‌కు వ్యతిరేకం” అని ఇమ్రాన్ ఖాన్ ట్విట్టర్ వేదికగా సింధ్ ప్రావిన్స్ యంత్రాంగాన్ని ఆదేశించారు.

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సింధ్ ప్రావిన్స్‌లోని ఖైరాపూర్ జిల్లా కుంభ్ అనే ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ చర్యను నిరసిస్తూ అక్కడి హిందూ సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై ఖైర్పూర్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందంతో ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.