ఆక్రమణలపై ఉక్కుపాదం… మీడియా వరుస కథనాలతో ఎట్టకేలకు స్పందించిన రెవిన్యూ అధికారులు
పొదిలి పెద్ద, చిన్న చెఱువుల భూములకు పర్యవేక్షణ లోపించడం అక్రమార్కులకు వరంలా మారింది. ఈ నేపథ్యంలో మీడియా వరుస కథనాలను ప్రచురిస్తుండగా ఎట్టకేలకు రెవిన్యూ అధికారులు స్పందించి ఇరిగేషన్ అధికారులతో కలిసి సర్వే ప్రారంభించారు.
వివరాల్లోకి వెళితే సోమవారంనాడు మండల రెవిన్యూ తహశీల్దార్ తన సిబ్బందితో కలిసి పొదిలి పెద్దచెఱువుకు సంబంధించిన భూములను స్థానిక మార్కాపురం అడ్డరోడ్డు వద్ద నుండి బుగ్గచలం ట్యాంకు వరకు ఉన్న భూములను పరిశీలించి సర్వే చేయించారు.
ఈ సందర్భంగా కోట్లరూపాయలు విలువచేసే భూమిని అక్రమార్కులు అక్రమించుకుని అక్రమనిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించి…. వీలైనంత త్వరగా నోటీసులు జారీ చేసి ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా రెవిన్యూ యంత్రాంగం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ కార్యక్రమంలో మండల రెవిన్యూ తహశీల్దార్ జీవిగుంట ప్రభాకరరావు, ఇరిగేషన్ ఏఈ, గ్రామ పంచాయతీ కార్యదర్శి బ్రహ్మనాయుడు, రెవిన్యూ సిబ్బంది, ఇరిగేషన్ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.