బతుకమ్మ’ చరిత్ర ఇదీ!

తెలంగాణ ప్రజల జీవన చిత్రం
పూల లోగిళ్లుగా వాకిళ్లు
నేడు సద్దుల బతుకమ్మ వేడుకలు
కరీంనగర్‌ కల్చరల్‌/సిరిసిల్ల/పెద్దపల్లి కల్చరల్‌, అక్టోబరు 16: సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద పీట వేసే భారత దేశంలో పండుగలకు విశిష్ట స్థానం ఉంది. తెలంగాణలో జరుపుకునేపర్వదినాల్లో బతుకమ్మ పండగ చెప్పుకోదగింది. సద్దుల బతుకమ్మగా పిలిచే ఈ పండుగా స్త్రీలకు పెద్ద పండుగగా గుర్తింపు పొందింది. ఆశ్వయుజ అమావాస్య నాడు ఎంగిలి పూలు పేరుతో ఎంగిలి కాని, వాడని పూలతో పేర్చిన బతుకమ్మ దుర్గాష్టమి సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. దీనికి ముందు తొమ్మిది రోజులు పీట చెక్కపై మట్టి గద్దెను వేసి దానిపై బియ్యపు చెంబును నిల్పి పూలతో అలంకరించి కన్నె పిల్లలు ఆడేది బొడ్డెమ్మ పండుగ. ప్రకృతిలో లభించే ప్రతీ పూవును ఏరికోరి నేర్పుతో పోటీతత్త్వంతో వివిధ రూపాల్లో బతుకమ్మలను తయారు చేయడం ఒక ఎత్త్తెతే వాటిని గృహలు, వీధులు, ఆలయాల్లో నిల్పి ప్రదక్షిణ వలయంలో తిరుగుతూ మహిళలు పాడే పాటలు వినసొంపుగా ఉంటాయి. ఒక స్త్రీ పాట పాడగా మిగిలిన వాళ్ళు వంత పాడటం దీని ప్రత్యేకత. ఉయ్యాల, కోల్‌, వరలో, కోయిలా, తుమ్మెదా, రామచిలుక, రాచగుమ్మడి, చెలియా, సందమామ వంటి వంత పదాలు, లయాత్మంగా సాగే, కోలలు, చప్పట్ల మోతలు ప్రతి ఒక్కరిని పరవశింపజేస్తాయి. పురాణ, ఇతిహాస కథలు మొదలు తెలంగాణ వీరుల కథల వరకు వర్తమాన అంశాలకు చెందిన విషయాలను పాటల రూపంలో పాడుతూ ఉంటారు. గుమ్మడి పూలలోని పసుపు వర్ణపు దుద్దును గౌరీ దేవిగా భావిం చి అందులో పసుపు గౌరమ్మను నిల్పి సుందరంగా ముస్తాబు చేసిన బతుకమ్మ చుట్టూ వయో బేధం లేకుండా మహిళలు, ఆడ పిల్లలు బతుకమ్మ ఆడుతారు. గోధుమలు, పెసళ్ళు, బియ్యం, మినుములు, తదితర ధాన్యాలతో తయారు చేసిన సత్తు (పిండి వంటలను) ప్రసాదంగా స్వీకరిస్తారు. బుధవారం ద్దుల బతుకమ్మ పండుగ జరుపుకోనున్నారు.
పండుగలో పూల పాత్ర..
ఈ పండుగలో ప్రకృతిలో దొరికే అన్ని రకాల పూలు కీలక పాత్ర పోషిస్తాయి. గుమ్మడి, గులాబీ, గోరింట, కట్ల, కనకాంబరాలు, గునుగు, తంగెడు, సీతజడలు, పట్టుకుచ్చులు, రుద్రాక్ష, బంతి, చామంతి, పోకబంతి, అల్లి, లిల్లి, మల్లె, మందార, మరువం, పారిజాతం, కమలం, తామర, గన్నేరు లాంటి పూలు మన మన సులను ఆహ్లాద పరుస్తాయి. పండుగ సందడితో పాటు పూల లోగిలి కాని తెలంగాణ వాకిలి ఉండదంటే అతిశయోక్తి కాదు.
పండుగ వెనుక పలు ఇతిహాసాలు..
తెలంగాణ జానపదుల పండుగగా ప్రారంభమై ఆ తర్వాత నగరాలకు, విదేశాలకు సైతం పాకిన ఈ పండుగ ప్రాశస్త్యం, పుట్టుక వెనుక ఆసక్తికర కథనాలెన్నో ఉన్నాయి. కాకతీయ చక్రవర్తుల కాలాన అంటే సుమారు 12వ శతాబ్ది నుంచి ఈ పండుగ ఉన్నట్లు ఆధారాలున్నాయి. ఆ కాలంలో పూవులను బతుకుగా భావించి సుకుమార భావన కల స్త్రీలు ఆడే ఆటగా బొడ్డెను గౌరమ్మగా పూజించడం వల్ల బతుకమ్మగా మారిందనే భావన ఉంది. మహిషాసుర సంహరం కోసం అవతరించిన దుర్గాదేవి తొమ్మిది రోజుల్లో పెరిగి పెద్దదై రాక్షస సంహరం చేయడంతో ఆమె అనుగ్రహం కోరి మహిళలు చేసే ఆరాధనే బతుకమ్మ అని కొందరి అభిప్రాయం. గంగాగౌరీ సంవాదంలో భాగంగా శివుడు తలపై పెట్టుకున్న గంగను చూసి పార్వతి అసూయచెంది గంగను అందరూ పూజిస్తున్నారని తన తల్లితో చెబుతుంది. అప్పుడు తల్లి ఓదార్చి గంగ మీద నిన్ను పూల తెప్పలా తేలించి పూజించేలా చేస్తానంటుంది. అదే బతుకమ్మగా రూపాంతరం చెందిందని కూడా చెబుతారు. పూర్వం అక్కెమ్మ అనే యువతికి ఏడుగురు అన్నలుంటే పెద్ద వదిన పాలలో విషం కల్పి మరదలికి తాగించి చంపి వేసి ఆ తర్వాత ఊరి బైట పాతి పెట్టింది. అక్కడ అడవి తంగెడు చెట్టు పుట్టి విరగబూసింది. ఊరికి వెళ్ళి వచ్చిన అన్నలు చెల్లెకు పూలిద్దామని తెంపబోతే ఆమె ఆత్మ తన మరణం గురించి చెబుతుంది. అప్పుడు అన్నలు నీకు ఏం కావాలో కోరుకోమ్మంటే ఈ తంగెడు పూలల్లో నన్ను చూసుకొమ్మని, ఏటా నాపేర పండుగ చేయండని అనడంతో ఈ పండుగ ఏర్పడ్డట్టు మరో కథ ప్రాచుర్యంలో ఉంది. చాలా కాలం కిందట సంతానం లేక పరితపిస్తన్న దంపతులకు ఓ అమ్మాయి దొరకగా అమ్మ వారి ప్రసాదంగా భావించి పెంచి పెద్ద చేస్తారు. ఆమె పలు మహిమలు చూపుతూ లోకహిత కార్యాలు చేయడంతో ఆమె చుట్టూ చేరి దైవ స్వరూపంగా మహి ళలు కొలవగా ఈ పండుగ వచ్చిందని ఇతిహసం. ఓ దంపతులకు కలిగిన పిల్లలు కలిగినట్లుగా మరణిస్తుంటే పార్వతిని ప్రార్థించారట. ఆమె దయతో ఒక కూతురు కలిగి బతుకుతుందట. ఆమెకు బతుకమ్మ అని నామకరణం చేయడంతో ఈ పండుగ వచ్చిందని అంటుంటారు. చోళరాజైన జైన ధర్మాంగదుడు, అతని భార్య సత్యవతికి కలిగిన వంద మంది కుమారులు యుద్ద రంగంలో చనిపోగా లక్ష్మిదేవిని తమ కుమార్తెగా జన్మించమని ప్రార్థించారట. ఆమె కూతురై జన్మించిన సందర్భంలో సమస్త మునులు రాజు ఇంటికి వచ్చి చిరకాలం బతుకమ్మా అని ఆశీర్వదించగా ఈ పండుగ ఏర్పడినట్లు కూడా చెబుతారు.
రెండు బతుకమ్మలు ఎందుకుంటే..
తొమ్మిది రోజులపాటు ఆటాపాటలతో సాగే బతుకమ్మ వేడుకల్లో చివరి రోజు పెద్ద బతుకమ్మ రోజు మాత్రం రెండు బతుకమ్మలను మహిళలు పేరుస్తారు. మనం ఏ శుభకార్యం చేసిన ఒక వస్తువు ఎప్పుడు ఉపయోగించం. ముఖ్యంగా మన ఇళ్లలో వివాహం జరిగినప్పుడు ఆడబిడ్డను అత్తారింటికి సాగనం

పినప్పుడు తోడు పెళ్లికూతురుగా మరోకరిని పంపిస్తాం. ఒంటరిగా పంపించవద్దని సాంప్రదాయాన్ని పెద్ద బతుకమ్మను తల్లిగా చిన్న బతుకమ్మను కూతురుగా భావించి వేడుకలు జరుపుకుంటారు.
సద్దుల బతుకమ్మకు సిద్ధమవుతున్న ఆడపడుచులు
బుధవారం ఎంగిలి పూలతో ప్రారంభమైన ఈ వేడుకలు గ్రామగ్రామాన, పల్లెపల్లెనా ఘనంగా జరుగుతున్నాయి. జిల్లా కేంద్రంలో కూడా అన్ని వర్గాల ప్రజలు, అధికారులు, ఉద్యోగులు బతుకమ్మ పండుగలో భాగస్వాములవుతున్నారు. బుధవారం జరిగే సద్దుల బతుకమ్మ కోసం ఏర్పాట్లు చేసుకున్నారు. పిండి వంటలు, సత్తు పిండి సిద్దం చేసుకున్నారు. నూతన వస్త్రాలు కొనుగోలు చేశారు. పండుగలో కీలక భూమిక పోషించే పూల కోసం ప్రయత్నాలు చేశారు.