ద్విచక్ర వాహనచోదకులకు శిరస్త్రాణం శిరోధార్యం సిఐ సుధాకర్ రావు
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ప్రతి శనివారం అమలు చేస్తున్న”నో యాక్సిడెంట్ డే” డ్రైవ్లో భాగంగా యస్పీ మలిక గర్గ్ ఆదేశాల మేరకు పొదిలి పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ సుధాకర్ రావు ఆధ్వర్యంలో రోడ్డు భద్రత నియమాలుపై కొత్త తరహాలో అవగాహనా కల్పించారు.
వివరాల్లోకి వెళితే శనివారం నాడు స్థానిక విశ్వనాథపురం సెంటర్ నందు ద్విచక్ర వాహనదారులకు మరియు ప్రజలకు పోలీస్ అధికారులు హెల్మెట్ యొక్క ఉపయోగం, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వలన జరిగే అనర్థాల గురించి చక్కని నమూనా లఘు చిత్రం ద్వారా అవగాహన కల్పించడం జరిగింది.
హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులకు ఫైన్ వెయ్యకుండా వారిచే గెటప్ వేయించి బైక్ యాక్సిడెంట్ జరిగితే తలకు, చేతులకు మరియు ఇతర శరీర భాగాలకు తీవ్ర దెబ్బలు తగిలి ఏ విధంగా రోధిస్తారో ప్రజలకు కళ్ళకు కట్టినట్టు చూపించడం జరిగింది.
అదే విధంగా, వారి గెటప్ యొక్క సెల్ఫీని వారి కుటుంబ సభ్యులకు పంపి వారు నిజంగా గాయాలతో ఎంత ఆందోళన చెంది భాదపడతారో తెలుసుకునేలా చేస్తున్నారు.
ఈ సందర్భంగా సిఐ సుధాకర్ రావు మాట్లాడుతూ హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే ఎక్కువమంది తలకు గాయం కావడం వల్లే చనిపోతున్నారని, చాల మందికి బ్రెయిన్ డామేజ్ అయ్యి కోమాలోకి వెళ్లడం, పెరలాసిస్ కు గురికావడం వంటి ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయని, వాటి వలన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని హెల్మెట్ ధారణతో ప్రమాదాల నుండి రక్షణ పొందవచ్చని, కావున ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల నుండి తమను తాము కాపాడుకోవాలని సూచించారు.
ప్రతి వాహనదారుడు డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మైనర్లు వాహనాలు నడపరాదని, అతివేగం, ట్రిపుల్ రైడింగ్,సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదని సిఐ సుధాకర్ రావు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పొదిలి యస్ ఐ శ్రీహరి ఎ యస్ఐ సురేష్ మరియు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు