పొదిలి మండలంలో కలెక్టర్ దినేష్ కుమార్ విస్తృత పర్యటన

ఉపాధి హామీ పథకంలో కూలీలకు రోజు వారీ మెరుగైన కూలి డబ్బులు దక్కేలా పనులు చేయించలేని మేట్లను తొలగించాలని జిల్లా కలెక్టర్ శ్రీ.ఏ.ఎస్.దినేష్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం ఆయన పొదిలి మండలంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. తలమళ్ల గ్రామంలోని చెరువులో చేపడుతున్న ఉపాధి హామీ పనులను ఆయన తనిఖీ చేశారు. కూలీల హాజరు, రోజువారీగా వారికి దక్కుతున్న కూలి, తదితర అంశాలపై ఆరా తీశారు. నిబంధనల ప్రకారం పూర్తి స్థాయిలో పని చేస్తే ఒక్కో కూలీకి రోజుకు రూ.257 దక్కే అవకాశం
ఉందని చెప్పారు. కానీ గత ఐదు రోజులుగా ఈ చెరువులో మట్టి పనులకు కూలీలు హాజరవుతున్న తీరు, పని గంటలను పరిశీలిస్తే వారికి ఒక్కొక్కరికి రూ.178 మాత్రమే దక్కుతున్నట్లు గుర్తించారు. ఉదయం 6 గంటల నుంచి 10:30 గంటల వరకూ పని చేయాలని కలెక్టర్ వారికి చెప్పారు.

ఈ దిశగా కూలీలకు మెరుగైన కూలి డబ్బులు దక్కేలా వారిని సమీకరించి పర్యవేక్షించడంలో విఫలమవుతున్న మేట్లను తొలగించడానికి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డ్వామా పి.డి. శీనారెడ్డిని ఆదేశించారు. ఈ చెరువు కింద 85 ఎకరాల ఆయకట్టు ఉన్నట్లు అధికారులు చెప్పగా, సాగు సమయంలో నీటి నిల్వ, ప్రవాహం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ మట్టి తవ్వకం పనులు చేపట్టాలని సూచించారు.

మౌలిక వసతులపై సమగ్ర పర్యవేక్షణ

పొదిలి పాత బస్టాండ్ సెంటర్లోని బాలికల ఉన్నత పాఠశాలను కూడా కలెక్టర్ తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య, అదనపు తరగతి గదుల నిర్మాణానికి తీసుకుంటున్న చర్యలు, నాడు-నేడు పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులు, లైబ్రరీ నిర్వహణ తదితర అంశాలపై ఆయన ఆరా తీశారు. నాడు – నేడు పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులను సక్రమంగా పర్యవేక్షించాలని, మరుగుదొడ్లు, తాగునీటి వ్యవస్థ నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇచ్చి పరిశుభ్రత పాటించాలని ప్రధాన ఉపాధ్యాయుడు శ్రీనివాసులుకు చెప్పారు.

జగనన్న హౌసింగ్ లేఅవుట్ లలో ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా జరిగేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ.ఏ.ఎస్.దినేష్ కుమార్ స్పష్టం చేశారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. శుక్రవారం పొదిలిలో పర్యటించిన ఆయన పొదిలి -1 మేజర్ లేఅవుట్ ను, తలమళ్ల గ్రామంలోని హౌసింగ్ లే అవుట్ ను పరిశీలించారు. ఆయన వెంట హౌసింగ్ పీ.డీ.పీరయ్య కూడా ఉన్నారు. అనంతరం పొదిలి ఎం.పి.డి.ఓ. కార్యాలయంలో మండలస్థాయి అధికారులతో కలెక్టర్ ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నందున వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

పొదిలి అర్బన్ మేజర్ లేఅవుట్ లో 1872 మందికి పట్టాలు ఇచ్చామని, వీరిలో 1594 మందికి ఇళ్లు మంజూరు చేశామని అధికారులు చెప్పారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ మంచి విలువైన స్థలంలో పట్టాలు మంజూరు చేసినా ఇళ్ల నిర్మాణాలు ఆశించిన స్థాయిలో ఎందుకు ప్రారంభం కాలేదని ప్రశ్నించారు. వచ్చే నెల రోజుల వ్యవధిలో కనీసం వెయ్యి మంది ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇందుకు అవసరమైన నీటి సరఫరా, విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఆర్.డబ్ల్యు.ఎస్, ఏ.పీ.సి.పి.డి. సి. ఎల్ అధికారులకు స్పష్టం చేశారు. ఆ లేఅవుట్ లో ఎలాంటి దొంగతనాలు జరగకుండా పోలీసులతో నిఘా కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్వయం సహాయక సంఘాలలో ఉన్న మహిళలకు ప్రభుత్వం అదనంగా మరో రూ.35 వేల ఆర్థిక సహాయం కూడా చేస్తున్నందున లబ్ధిదారులకు ఈ విషయం వివరించి త్వరగా ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టేలా చైతన్య పరచాలని సూచించారు. ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టకపోతే పట్టా రద్దు చేయాలని చెప్పారు. ఈ విషయంపై లబ్ధిదారులకు నోటీసులు జారీచేయాలని తహసీల్దార్ ను కలెక్టర్ ఆదేశించారు.

తలమళ్ళ హౌసింగ్ లేఅవుట్ మీదగా వెళ్తున్న విద్యుత్ లైన్లను మార్చడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా కలెక్టర్ చెప్పారు.

మండలంలో ఓటీఎస్ పైనా కలెక్టర్ ఆరా తీశారు. 82% రిజిస్ట్రేషన్లు పూర్తిచేశామని తహాసిల్దార్ దేవ ప్రసాద్ ఈ సందర్భంగా కలెక్టరుకు
వివరించారు. మండలంలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్ లు, డిజిటల్ లైబ్రరీలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ల నిర్మాణాలపైనా కలెక్టర్ సమీక్షించారు. హెల్త్ క్లినిక్ లకు సంబంధించి రెండు చోట్ల భూ సమస్యలు ఉన్నాయని పంచాయతీ రాజ్ ఏఈ చెప్పగా, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తహసిల్దారును కలెక్టర్ ఆదేశించారు.

స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా మండలంలోని అన్ని గ్రామాలలో ప్లాస్టిక్ ను వినియోగించకుండా తీర్మానాలు చేయించాలని అధికారులకు కలెక్టర్ చెప్పారు. స్వయం సహాయక సంఘాల మహిళలతో సంచులను తయారు చేయించి వాటిని స్థానికులకు విక్రయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

మండలంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేయాలని ఐ.సి.డి. ఎస్. సి.డి.పి.ఓ.ను కలెక్టర్ ఆదేశించారు. పిల్లల ఆరోగ్యము, వారికి విద్య పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పారు.

ఈ విషయాల్లో నిర్లక్ష్యంగా ఉన్న అంగన్వాడీ టీచర్ లను సస్పెండ్ చేయాలని చెప్పారు. నిర్దిష్ట బరువుకంటే తక్కువ బరువున్న చిన్నారులను గుర్తించి వారి ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులతోనూ మాట్లాడాలని కలెక్టర్ సూచించారు. పదోతరగతి పూర్తయిన ప్రతి బాలిక తప్పనిసరిగా పైచదువుల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని ఎం.ఈ.వో.ను ఆదేశించారు.

ఈ సమావేశంలో ఆర్డీవో సందీప్ కుమార్, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ సరళా వందనం, మండల స్పెషల్ ఆఫీసర్ లక్ష్మా నాయక్, ఎం.పీ. డి.వో. శ్రీకృష్ణ, మున్సిపల్ కమిషనర్ డానియేల్ జోసఫ్, పలు శాఖల మండల అధికారులు పాల్గొన్నారు

బాల్య వివాహాల కట్టడికి అవగాహన కార్యక్రమాలు

బాప్టిస్టుపాలెంలోని అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. పిల్లల నమోదు, వారి ఆరోగ్య వివరాలు, వయసుకు తగ్గట్లుగా ఎత్తు, అంగన్వాడీ పరిధిలోని బాలింతలు తదితర వివరాలపై ఆరాతీశారు. గర్భిణులతో ప్రత్యేకంగా మాట్లాడారు. వారి విద్యార్హతలను అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి పూర్తవగానే తమ తల్లిదండ్రులు పెళ్లి చేసినట్లు పలువురు ఈ సందర్భంగా కలెక్టర్ కు చెప్పారు. దీనిపై కలెక్టర్ వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారికి ఫోన్ చేసి ప్రత్యేకంగా మాట్లాడారు. బాల్య వివాహాల నివారణ కోసం పదో తరగతి జరుగుతున్న బాలికలకు, వారి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులతో ప్రత్యేక అవగాహన కల్పించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. పిల్లలకు పెడుతున్న ఆహారాన్ని ఈ సందర్భంగా కలెక్టరు పరిశీలించారు. గర్భిణులకు పోషకాహారం కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట ఐ.సి.డి.ఎస్. పి.డి. ధనలక్ష్మి, ఇతర అధికారులు ఉన్నారు.

ప్లాస్టిక్ వాడొద్దు..

ఆదర్శ గ్రామంగా ఎంపికైన అక్కచెరువు లోనూ కలెక్టర్ పర్యటించారు. ఇదే స్ఫూర్తితో గ్రామంలో పరిశుభ్రతను పాటించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ ను వినియోగించ వద్దని, దానికి బదులుగా స్వయం సహాయక సంఘాలు తయారుచేసే సంచులను వాడాలని సూచించారు. తడి చెత్తను, పొడి చెత్త ను ఇళ్లలోనే వేరు చేసి క్లాప్ మిత్రలకు అందివ్వాలని అన్నారు. అనంతరం గ్రామంలోని ‘చెత్త నుంచి సంపద తయారీ కేంద్రా’న్ని కలెక్టర్ పరిశీలించారు. వానపాముల పెంపకం, వర్మీ కంపోస్ట్ తయారీని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఈ కేంద్రం నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట డి.పి.ఓ.నారాయణ రెడ్డి, తదితర అధికారులు ఉన్నారు.