విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్దమైన దుకాణం… మూడు లక్షల ఆస్తినష్టం

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దుకాణం పూర్తిగా దగ్దమై 3లక్షల ఆస్తినష్టం కలిగిన సంఘటన శుక్రవారంనాడు చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే స్థానిక విశ్వనాథపురంలోని ఇస్లాంపేట నందు కిరాణా దుకాణంలోని ఫ్రిడ్జ్ షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో దుకాణం పూర్తిగా కాలిపోయి సుమారు 3లక్షల రూపాయల ఆస్తినష్టం జరిగింది.

అగ్నిమాపక శాఖ అధికారి శ్యామ్ బాబు బృందం కథనం ప్రకారం….. సమాచారం అందగానే దరిశి నుండి హుటాహుటిన బయలుదేరి రావడం జరిగిందని….. అయితే వచ్చేలోగా స్థానికులు మంటలను అదుపు చేసినప్పటికి దుకాణం పూర్తిగా దగ్దమైందని తెలిపారు. ఫ్రిడ్జ్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన ప్రమాదం సంభవించిందని పక్కనే గ్యాస్ సిలిండర్ ఉన్నప్పటికీ మంటలు మంటలు అంటుకోకపోవడంతో పెను ప్రమాదమే తప్పిందని….. సుమారు 3లక్షల వరకు ఆస్తినష్టం జరిగి ఉండవచ్చునని ప్రాధమికంగా అంచనా వేసినట్లు తెలిపారు.

అలాగే వీధులు చాలా ఇరుకుగా, వాహనం వచ్చేందుకు వీలు లేకుండా ఉండడం అలాగే విద్యుత్ తీగలు కూడా అడ్డంగా ఉండడంతో వాహనం వచ్చేందుకు వీలు లేకుండా ఉందని….. ఇటువంటి ప్రమాదాలు సంభవించినప్పుడు అత్యవసర వాహనాలకు త్వరగా సంఘటనా స్థలానికి చేరుకునేలా స్థానికులు సంబంధిత అధికారులతో మాట్లాడి వాహనాలు వచ్చేలా చూసుకోవాలని….. ప్రతిఒక్కరూ అలాగే ఫైర్ సేఫ్టీపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు.

స్థానికులు, బాధితుల కథనం ప్రకారం….. దుకాణ యజమాని పొదిలి రంగనాయకులు భార్య రోజులాగే దుకాణం తెరిచి వస్తువులు సర్దుకుంటుండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో భయంతో కేకలు వేయగా స్థానికులు వచ్చి మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తూనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగా…… అగ్నిమాపక వాహనం వచ్చేలోగానే మంటలను అదుపుచేయడం జరిగిందని అప్పటికే దుకాణం మొత్తం పూర్తిగా కాలిపోయి సుమారు 3లక్షల ఆస్తినష్టం జరిగిందని తెలిపారు.

అగ్నిమాపక వాహనం పొదిలిలో ఉంటే మంటలను సకాలంలో ఆర్పివేసేందుకు అవకాశం ఉండేదని….. అత్యవసర సమయాల్లో అగ్నిమాపక వాహనం వచ్చేవరకు వేచి చూసేలోగా జరగవలసిన నష్టం జరిగిపోయే అవకాశం ఉన్నందున పొదిలిలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని అలాగే బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు.