అంగరంగ వైభవంగా దేవి శరన్నవరాత్రి ముగింపు వేడుకలు

విజయదశమి పురస్కరించుకుని దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పొదిలిలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. గత ఏడూ రోజులుగా జరుగుతున్న దేవి నవరాత్రి ఉత్సవాలు గురువారం నాడు ముగిశాయి. ఈ సందర్భంగా పొదిలి పరిసర ప్రాంతాలనుండి వేల సంఖ్యలో భక్తులు పొదిలిలోని పలు అమ్మవారి దేవాలయాలలోని అమ్మవార్లను దర్శించుకుని భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండుగ చివరిరోజు అయిన గురువారం నాడు శివాలయం మరియు వేణుగోపాలస్వామి దేవస్థానాల నుండి బయలుదేరిన పారువేట (ఊరేగింపు) పొదిలమ్మ దేవస్థానం వద్దగల శమీ వృక్షం వద్దకు చేరుకున్న అనంతరం భక్తులచే పూజలందుకుని తిరిగి ఆయా దేవస్థానాలకు వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పారువేట భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఏర్పాట్లు చాలా బాగున్నాయని మునుముందు ఇంకా వైభవంగా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. అలాగే పొదిలమ్మతల్లి ఆలయానికి ప్రహరీ నిర్మిస్తే బాగుంటుందని పలువురు భక్తులు పొదిలి టైమ్స్ ద్వారా దాతలకు విజ్ఞప్తి చేశారు. 8 విశేషంగా పూజలందుకున్న అమ్మవార్లకు 9వరోజు అయిన శుక్రవారం నాడు గ్రామోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పొదిలిలోని పలు దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకుని, ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని పొదిలి టైమ్స్ ద్వారా విజ్ఞప్తి చేశారు.