దూసుకొస్తున్న దయె తుఫాన్ ఉత్తరాంధ్రపై తీవ్ర ప్రభావం రాయలసీమకూ భారీ వర్ష సూచన
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గురువారం రాత్రికి మరింత బలపడి తుపానుగా మారింది..గురువారం రాత్రి 8.30 గంటల సమయానికి ఒడిశాలోని గోపాల్‌పూర్‌కి ఆగ్నేయంగా 90 కిలోమీటర్ల దూరంలో, కోస్తాంధ్రలోని కళింగపట్నానికి ఈశాన్యంగా 165 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. గంటకు 23 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది..
గురువారం అర్ధరాత్రి సమయానికి గోపాల్పూర్ వద్ద తీరం దాటే అవకాశముంది. ఈ తుపాన్‌కు ‘దయె’ అని పేరు పెట్టారు. మయన్మార్ దేశం ఈ పేరు పెట్టింది..
తుపాన్ ప్రభావంతో కోస్తా తీరం వెంబడి గంటకు 60 కిలోమీటర్ల నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. తుపాను తీరం దాటే సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, అలలు అర మీటరు ఎత్తున ఎగసిపడే ప్రమాదం ఉందని తెలిపింది..
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల తీరం వెంబడి ఉప్పెన మాదిరిగా సముద్రం ముందుకు పొంగే అవకాశం ఉందని హెచ్చరించింది. తీరం దాటాక తుపాను వేగం మరింత పెరుగుతుందని వివరించింది. శుక్రవారం సాయంత్రం వరకు తుపాన్ ప్రభావం ఉండొచ్చని అంచనా..
శుక్రవారం ఉదయం వరకు కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెప్పారు. రాయలసీమలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు…ఆ తరువాత దయె తుపాను బలహీనపడి శనివారం నాటికి వాయుగుండంగా ఉంటుందని వివరించారు. శనివారం కూడా కొన్నిచోట్ల భారీ వర్షాలు కురవొచ్చని అంచనా..
ఒడిశాలో అప్రమత్తం
భువనేశ్వర్,
దయె తుపాను నేపథ్యంలో ఒడిశా రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమైంది. గురువారం సాయంత్రం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఆదిత్యప్రసాద్ పాఢి ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించారు.అనంతరం విలేకరులతో మాట్లాడారు..వాతావరణ అధ్యయన శాఖ 7 జిల్లాలను అప్రమత్తం చేసిందని, గంజాం, గజపతి, ఖుర్ధా, పూరీ, నయాగఢ్ జిల్లాల్లో అధిక ప్రభావం ఉంటుందని వెల్లడించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఒడిశా విపత్తు సత్వర కార్యాచరణ దశం సిబ్బందిని, ఆహార సామగ్రి సిద్ధంగా ఉంచామన్నారు..
మూడు జిల్లాల్లో తీవ్ర ప్రభావం
తుపాను ప్రభావం కారణంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో వివిధ రంగాలకు నష్టం వాటిల్లవచ్చని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. గుడిసెలు, విద్యుత్తు తీగలు, స్తంభాలు, రహదారులు, పంటలు ధ్వంసమయ్యే అవకాశం ఉందని వివరించింది..అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాలో మత్స్యకారులెవరూ వాయవ్య బంగాళాఖాతం దిశగా చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది..కోస్తాంధ్ర వెంబడి సముద్రతీరం చురుగ్గా ఉంటుందని, శనివారంనాటికి గాలుల వేగం గంటకు 45 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్లకు తగ్గుతుందని తెలిపింది..