దివ్యాంగులు విజ్ఞాన జ్యోతులు: జడ్పీటిసి సాయి

దివ్యాంగులకు ప్రత్యేకమైన తెలివితేటలు ఉంటాయని దివ్యాంగుల విజ్ఞాన జ్యోతులని, వారు సకలాంగులకు ఏ మాత్రమూ తీసిపోరని జడ్పీటిసి సభ్యులు సాయిరాజేశ్వరరావు అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్ధానిక మండల పరిషత్ కార్యాలయ ప్రాగంణంలోని భవిత పాఠశాలలో భవిత పాఠశాల అధ్యాపకులు గోపాలకృష్ణ అద్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన జడ్పీటిసి సాయి మాట్లాడుతూ దివ్యాంగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వారికి భవిత పాఠశాల ప్రత్యేకమైన సౌకర్యాలు కల్పిస్తుందని తెలిపారు.దివ్యాంగులు ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకుని సద్వినియోగం చేసుకోవడం ద్వారా దివ్యాంగులు కూడా ఎంతో ఉన్నతమైన స్థాయికి ఎదుగుతారని సూచించారు. మండల పరిషత్ అధ్యక్షులు కె నరసింహరావు మాట్లాడుతూ దివ్యాంగులమని ఎవరూ అధైర్యపడవద్దని, వారికి మంచి భవిష్యత్ ఉందని చెప్పారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో దివ్యాంగులు ఇతరులకు తీసిపోని విధంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని భరోసానిచ్చారు. దివ్యాంగులకు ఆత్మైస్థెర్యం ఎక్కువగా ఉంటుందని, వారు ఏ పనినైనా నిబద్ధతతో సాధిస్తారని గుర్తు చేశారు. అనంతరం జిల్లా స్థాయిలో వివిధ క్రీడల్లో రాణించి బహుమతులు గెలుచుకున్న విద్యార్థులకు అతిథులు ట్రోఫీ, ప్రశంసా పత్రాలను అందజేశారు. తొలుత వాసవీ క్లబ్ విశ్వనాథపురం సౌజన్యంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక తరగతి గదిని ప్రారంభించారు. అనంతరం భవిత పాఠశాలకు వివిధ రకాలుగా సహకరించిన దాతలకు దుశ్శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, వివిధ సంస్థల ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, తల్లిందడ్రులు, తదితరులు పాల్గొన్నారు.