బిల్ కలెక్టర్ ల అక్రమాలపై విచారణ చేపట్టిన డి ఎల్ పి ఓ

పొదిలి గ్రామపంచాయతీలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పని చేసిన ఇద్దరు బిల్ కలెక్టర్ లపై కందుకూరు డివిజనల్ పంచాయతీ అధికారి భాస్కర్ రెడ్డి విచారణ చేపట్టారు. వివరాల్లోకి వెళితే పొదిలి గ్రామ పంచాయతీలోని ఇంటిపన్నుల సవరణలకు సంబంధించి జిల్లా పంచాయతీ అధికారి ఆదేశాల మేరకు అప్పటి పంచాయతీ కార్యదర్శి కాటూరి వెంకటేశ్వర్లు పన్నుల సవరణకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరణ చేపట్టారు. అయితే బిల్ కలెక్టర్ లు ఇంటి పన్ను తామే సవరిస్తామంటూ పంచాయతీ పరిధిలోని గృహ యజమానుల వద్ద దరఖాస్తులు స్వీకరించి,సవరణ చేసామంటూ రసీదులను ఇచ్చి దాదాపు 10 లక్షల వరకు అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని గుర్తించిన పంచాయతీ కార్యదర్శి ఇద్దరు బిల్ కలెక్టర్ లకు షోకాజ్ నోటీసులు ఇవ్వగా వారి సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న జిల్లా పంచాయతీ అధికారి విచారణ బాధ్యతను డివిజనల్ పంచాయతీ అధికారికి అప్పగించగా బుధవారంనాడు పొదిలి పంచాయతీ కార్యాలయంలో అక్రమాలపై విచారణను ప్రారంభించారు. ఈ అక్రమాలకు సంబంధించి పొదిలి టైమ్స్ ప్రతినిధి అడగగా పూర్తి స్థాయి విచారణ అనంతరం జిల్లా పంచాయతీ అధికారికి తదుపరి చర్యలు కొరకు నివేదికను అందజేస్తామని తెలిపారు.