ఘనంగా డిప్యూటీ తహశీల్దార్…. విఆర్ఓ లకు వీడ్కోలు పలికిన రెవిన్యూ సిబ్బంది
పొదిలి మండల రెవిన్యూ ఉపతహశీల్దార్ జానిబేగ్ మరియు విఆర్ఓ బ్రహ్మారెడ్డిల పదవీవిరమణ సందర్భంగా పొదిలి రెవెన్యూ అధికారులు, సిబ్బంది వారిని ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు.
వివరాల్లోకి వెళితే పొదిలి మండల రెవిన్యూ ఉప తహశీల్దార్ జానిబేగ్, విఆర్ఓ బ్రహ్మారెడ్డిల పదవీవిరమణ సందర్భంగా ఆదివారంనాడు మండల రెవిన్యూ తహశీల్దార్ ఎస్ఎం హమీద్ ఆధ్వర్యంలో రెవిన్యూ సిబ్బంది వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు.
ఈ సభలో ముఖ్యఅతిథిగా హాజరైన గిద్దలూరు రెవిన్యూ తహశీల్దార్ జి వి సుబ్బారెడ్డి మాట్లాడుతూ రెవిన్యూ శాఖలో అంచెలుగా ఎదిగి ఉపతహశీల్దార్ స్థాయిలో పదవీవిరమణ చేస్తున్న జానిబేగ్ తన విధినిర్వహణలో నిజాయితీ నిబద్ధతతో అలాగే ఎటువంటి ఆరోపణలు లేకుండా పదవీవిరమణ సమయం వరకు పనిచేయడం ఆయన నిజాయితీకి అద్దంపడుతుందని కొనియాడారు.
పొదిలి మండల రెవిన్యూ తహశీల్దార్ ఎస్ఎం హమీద్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో నేను పొదిలికి బదిలీపై వచ్చినప్పటి నుండి జానిబేగ్ ప్రతి పనిలో ఎటువంటి ఆటుపోట్లు ఎదురైనా సహకారం అందిస్తూ ఎన్నికల నిర్వహణలో, రైతుల సమావేశాలలో, రెవిన్యూ పరమైన అన్ని వ్యవహారాలలో చేదోడుగా ఉన్నారని….. అలాగే విఆర్ఓ బ్రహ్మారెడ్డి కూడా తన విధినిర్వహణలో ఎంతో నిబద్ధత కలిగి తన పరిధిలోని రైతులు కానీ ప్రజలు కానీ తన వద్దకు ఏదైనా పనిమీద వచ్చినప్పుడు సున్నితంగా పరిష్కరించేవారని అన్నారు.
సిఎస్ పురం, కొనకనమిట్ల, గిద్దలూరు, రెవిన్యూ ఉప తహశీల్దార్ లు మాట్లాడుతూ తాము కలిసి పనిచేసిన క్షణాలను గురించి…. అలాగే రెవిన్యూలో ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు జానిబేగ్ ఇచ్చిన సలహాలు పరిష్కరించిన సమస్యలను గుర్తుకు తెచ్చుకున్నారు.
అనంతరం జరిగిన సన్మాన కార్యక్రమంలో పొదిలి మండల రెవిన్యూ తహశీల్దార్ హమీద్ సన్మాన గ్రహీత దంపతులను పూలమాలలు, శాలువాతో సత్కరించి ఉంగరాన్ని బహుకరించారు….. గిద్దలూరు తహశీల్దార్ సుబ్బారెడ్డి, ఉప తహశీల్దార్ లు, మండల రెవిన్యూ సిబ్బంది తదితరులు పూలమాలలు, శాలువాలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో వివిధ మండలాల రెవిన్యూ సిబ్బంది, జానిబేగ్, బ్రహ్మారెడ్డిల కుటుంబసభ్యులు, బంధువులు, ఆహ్వానితులు, తదితరులు పాల్గొన్నారు.