అవినీతి రహిత గ్రామ స్వరాజ్యం కోసమే గ్రామ సచివాలయాలు : ఆదిమూలపు సురేష్

మార్కాపురం : గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసమే గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడం జరిగిందని…. అందులో భాగంగానే రాష్ట్రప్రభుత్వం రాష్ట్రంలోని గ్రామాలకు సచివాలయాలను ఏర్పాటు చేసి అవినీతిరహిత పాలనకు తెరతీసిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు.

వివరాల్లోకి వెళితే మార్కాపురం డివిజన్ పరిధిలోని సచివాలయ ఉద్యోగులుగా ఎంపికయిన వారికి స్థానిక మార్కెట్ యార్డులో నియామకపు పత్రాలను అందజేసే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు సకాలంలో సేవలు అందాలనే లక్ష్యంగా పెట్టుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాదయాత్రలో ప్రజల కష్టాలు చూసి 72గంటల్లో ప్రజా సమస్యలకు పరిష్కారం అందే లక్ష్యంతో ఈ సచివాలయాలు ఏర్పాటు చేయడం జరిగిందని…. అందులో ఉద్యోగులుగా స్థానిక యువతకు అవకాశం ఇస్తానని పాదయాత్రలో ఇచ్చిన హామీ అమలుచేసి నాలుగు నెలల్లోనే 4లక్షల ఉద్యోగాలు ఇచ్చి రికార్డు సృష్టించారని అన్నారు.

గత ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీ పేరుతో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారని….. ఇప్పుడు జగనన్న ఆశయ సాధనకు అవినీతికి తావు లేకుండా పని చేయాలని…. పార్టీ, కులం, మతం చూడకుండా కేవలం అర్హతకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందేలా చూడాలని కోరారు.

అమ్మఒడి కార్యక్రమం ద్వారా 6, 456 కోట్ల రూపాయలు తల్లుల ఖాతాలకు ఇవ్వాలని…. ఇందులో కూడా పార్టీలు చూడకుండా పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి ఏటా నిధులు ఇస్తామన్నారు. లక్షలాది మందికి ఉద్యోగాలు ఇస్తుంటే ఓర్వలేని ప్రతిపక్ష పార్టీ నాయకులు అక్రమాలు జరిగాయని చెప్పడం సరైనపద్ధతి కాదన్నారు. ఈ ఉద్యోగాల్లో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరికయినా సిఫారసు లేఖలు ఇచ్చినట్లు నిరూపించగలరా అని ప్రశ్నించారు.

గిద్దలూరు శాసనసభ్యులు అన్నా రాంబాబు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు అర్హులకు అందజేయాలని, జగనన్న చేపట్టిన పాలన రాజన్నరాజ్య స్థాపన కోసమేఅని…. ఉద్యోగాలు పొందినవారు ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా పనిచేయాలని, తమకు ఫలానా చోట పోస్టింగ్ కావాలని మరలా మా వద్దకు సిఫారసు కోసం రాకూడదన్నారు.

మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి మాట్లాడుతూ రెవిన్యూ శాఖలో భూముల సర్వే సమస్య ఇప్పటి వరకు జఠిలంగానే ఉందని, ఈ ఉద్యోగాల ద్వారా వచ్చిన సర్వేయర్ లు సమస్యలు పరిష్కరిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.

నియామక పత్రాలను అందజేసిన ఆదిమూలపు సురేష్ అనంతరం ఉద్యోగులకు పత్రాలు పంపిణీ చేసే స్టాళ్ళ వద్దకు వెళ్లి వారికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గంగాధర్ గౌడ్, ఆర్డీఓ శేషిరెడ్డి, జేడి రామచంద్రమూర్తి, డీడి లక్ష్మీసుధ, పలు శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.