మార్కాపురం వద్ద రోడ్డు ప్రమాదం… కంభాలపాడు వ్యక్తి మృతి

మార్కాపురం మండలం రాయవరం గ్రామ పరిధిలోని పొదిలి-మార్కాపురం 565వ జాతీయ రహదారి పలకల క్వారీల వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ద్విచక్రవాహన చోదకుడు మృతిచెందిన సంఘటన శుక్రవారంనాడు చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే పొదిలి మండలం కంభాలపాడు గ్రామానికి చెందిన నరకూరి లక్ష్మీనర్సు(40) మార్కాపురం జార్జి కాలేజీలో చదువుతున్న తన కుమారుడిని చూసేందుకు కంభాలపాడు నుండి తన ద్విచక్రవాహనంపై వెళ్తున్న క్రమంలో పలకల క్వారీల వద్దకు రాగానే గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

విషయం తెలుసుకున్న మార్కాపురం రూరల్ ఎస్ఐ జి వెంకట సైదులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.