మధ్యాహ్న భోజన పధకం బిల్లులను వెంటనే చెల్లించాలి :సిఐటియు
మధ్యాహ్న భోజన పధకం కార్మికులకు రావలసిన 4నెలల బిల్లులను వెంటనే చెల్లించాలని సిఐటియూ పశ్చిమ ప్రకాశం కార్యదర్శి రమేష్ అన్నారు. బుధవారంనాడు స్థానిక ఎంఈఓ ఆఫీసు ఎదుట మధ్యాహ్న భోజనం పధకం కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పధకం ఏక్తాశక్తి అనే స్వచ్ఛంద సంస్థకు అప్పగించే ఆలోచన మానుకోవాలని అన్నారు. గత పదమూడు సంవత్సరాలుగా సరిగా బిల్లులు, జీతాలు రాకపోయినా కూడా సమర్ధవంతంగా పని చేస్తున్న కార్మికుల పొట్టకొట్టే విధంగా ఒక స్వచ్ఛంద సంస్థకు అప్పగిస్తే మధ్యాహ్న భోజనం పథకాన్ని కార్మికులు అడ్డుకుంటారన్నారు. మెనూ చార్జీ ఒక్కో విద్యార్థికి 10రూపాయలకు పెంచి అన్ని పాఠశాలల్లో నీటివసతి కల్పించి వంటకు వసతులు కల్పించాలని అన్నారు అలాగే ప్రతి కార్మికునికి 5వేల రూపాయలకు పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు ప్రభుదాసు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు తదితరులు పాల్గొన్నారు.