అంగరంగ వైభవంగా పార్వతీ సమేత నిర్మామహేశ్వర స్వామి రథోత్సవం
పృథులపూరి (పొదిలి) : మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని బుధవారం నాడు శ్రీ పార్వతిసమేత నిర్మమహేశ్వర స్వామి దేవస్థానం రధోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా జరిగే రధోత్సవ కార్యక్రమంలో కులమతాలకు అతీతంగా భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకోవడం అనాదిగా వస్తుంది.
గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం సుమారు 30వేలమంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుని రథాన్ని లాగేందుకు పోటీపడ్డారు.
వేల సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో పొదిలి పట్టణంలోని ప్రధానవీధులు మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయాయి.
అధికసంఖ్యలో భక్తులు పాల్గొనే ఈ కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పొదిలి సిఐ సుధాకరరావు , ఎస్ఐ శ్రీహరి, పొదిలి సర్కిల్ పరిధిలోని యస్ఐలు అంకమ్మరావు , ఫణి కుమార్, అంకమ్మరావు షేక్ వూదూద్ పలువురు ఏఎస్ఐలు మరియు కానిస్టేబుళ్లతో భారీ పటిష్ఠ బందోబస్తును ఏర్పాటుచేసారు.
కార్యక్రమ పూర్తి అయ్యే వరకు దర్శి డీఎస్పీ ప్రకాశ్ రావు ఎప్పటికప్పుడు భద్రతా చర్యలను పర్యవేక్షించి సలహాలు సూచనలు అందించారు.
గునుపూడి చెంచు సుబ్బారావు చారిటబుల్ ట్రస్ట్ మరియు లారీ ఓనర్స్ అసోసియేషన్, నాయా బ్రాహ్మణ యువజన సంఘం, పలు వ్యాపార వాణిజ్య సంస్థలు మరియు వ్యక్తిగత గతంగా పలువురు రధోత్సవ కార్యక్రమానికి హాజరైన భక్తుల సౌకర్యార్థం భక్తులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, ఎండ తీవ్రతను తట్టుకునేందుకు మంచినీరు, మజ్జిగ ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి, మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఇమ్మడి కాశీనాథ్ మరియు వివిధ రాజకీయ పార్టీల నాయకులు మరియు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు