యాదవ కార్పొరేషన్ చైర్మన్ గా నూకసాని నియామకం పట్ల హర్షం వ్యక్తం చేసిన అఖిల భారత యాదవ మహాసభ…
పొదిలి : రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ గా నూకసాని బాలాజీ నియామకం పట్ల పొదిలి అఖిలభారత యాదవ మహాసభ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ గా తెలుగుదేశంపార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మరియు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ నూకసాని బాలాజిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారంనాడు ఉత్తర్వులు జారీచేసింది.
ఈ సందర్భంగా పొదిలిలోని అఖిలభారత యాదవ మహాసభ కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా యాదవ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు పొల్లా నరసింహ యాదవ్ మాట్లాడుతూ నూకసాని బాలాజికి చైర్మన్ పదవి దక్కడం ఎంతో శుభపరిణామమని…… బిసి సామాజికవర్గం ఎక్కువగా ఉన్న ప్రకాశంజిల్లాలో చంద్రబాబు త్వరగా బిసిలకు టిక్కెట్లను కేటాయించాలని……. అలాగే చీరాల లేకపోతే కందుకూరు ఎమ్మెల్యే టిక్కెట్ ను నూకసాని బాలాజికి కేటాయించాలని డిమాండ్ చేశారు.
జిల్లా కార్యదర్శి మురబోయిన బాబురావు యాదవ్ మాట్లాడుతూ జయహో బిసి కార్యక్రమంలో యాదవ కార్పొరేషన్ ప్రకటించి కార్పొరేషన్ కు మన జిల్లాకు చెందిన నూకసాని బాలాజీని నియమించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. అలాగే నూకసాని బాలాజీ త్వరలోనే ఎమ్మెల్యే కావాలని ఆకాంక్షించారు. పలువురు యాదవ మహాసభ మండల నాయకులు నూకసాని బాలాజికి శుభాకాంక్షలు…..అలాగే కార్పొరేషన్ చైర్మన్ గా నియమించిన చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పొల్లా నరసింహ యాదవ్, మూరబోయిన బాబురావు యాదవ్, సిరిమల్లె శ్రీనివాస్ యాదవ్, నారెబోయిన బిక్షాలు, చాగంటి వెంకటేశ్వర్లు, బలగాని నాగరాజు, సన్నెబోయిన రాంబాబు, పొల్లా నరసింహ, బండారు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.