పెద్ద చెరువులోని అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్
పెద్ద చెరువులో జరుగుతున్న అక్రమనిర్మాణలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కాంగ్రెసు పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జి షేక్ సైదా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వివరాల్లోకి వెళితే ఆదివారం నాడు స్ధానిక రోడ్లు మరియు భవనముల అతిధి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో షేక్ సైదా మాట్లాడుతూ ప్రధాన రహదారి ప్రక్కనే కోట్లాది రూపాయలు విలువ చేసే పెద్ద చెరువకు సంబంధించిన భూమిలో గతనెల నుండి అక్రమంగా నిర్మాణం చేపట్టి పూర్తి చేసినా వాటిపై నేటికీ చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏమిటని…. పేదవాడు చిన్న గుడిసె వేసుకుంటేనే అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేసే అధికారులు అధికారపార్టీకి చెందినవారు అక్రమంగా నిర్మాణాలు చేస్తే చర్యలు ఉండవా అని ప్రశ్నించారు.
వారంలోగా అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోకపోతే వివిధ ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలను కలుపుకుని పెద్దఎత్తున ఆందోళనా కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెసు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.